మందేయడంలో గిన్నిస్‌ రికార్డ్‌.. 17 గంటల్లో 56 పబ్‌లకు.. 30 లీటర్లు తాగడంతో

23 Sep, 2022 17:22 IST|Sakshi

ఇంగ్లండ్‌లోని బ్రైటన్‌కు చెందిన నాదన్‌ క్రింప్‌ అనే 22 ఏళ్ల యువకుడు మందేయడంలో సరికొత్త గిన్నిస్‌ సృష్టించాడు! మందుకొట్టడం కూడా రికార్డేనా అని చులకనగా భావించకండి. ఎందుకంటే.. అతను సాధించింది అలాంటి, ఇలాంటి రికార్డు కాదు మరి... కేవలం 17 గంటల వ్యవధిలోనే ఏకంగా 67 పబ్‌లకు వెళ్లి అతను ‘పానీయం’ పుచ్చుకున్నాడు. తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాడు.

ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌కే చెందిన గ్యారెత్‌ మర్ఫీ అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి నెలకొల్పిన రికార్డును క్రింప్‌ బద్దలుకొట్టాడు. గిన్నిస్‌ నిర్వాహకుల నిబంధనల ప్రకారం సందర్శించే ప్రతి పబ్‌లోనూ మద్యమే సేవించాల్సిన అవసరం లేనప్పటికీ క్రింప్‌ మాత్రం ఒక పబ్‌లో మద్యం, మరో పబ్‌లో పానీయం సేవిస్తూ ముందుకెళ్లాడు. అయితే ఈ తతంగమేదీ ఆషామాషీగా జరగలేదని అతను చెప్పుకొచ్చాడు.
చదవండి: హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..

ముందుగా తమ ప్రాంతంలో ఉన్న పబ్‌లను జీపీఎస్‌ పరికరం ద్వారా మార్కింగ్‌ చేసుకొని తన ప్రయాణం మొదలుపెట్టాడట. తాను పబ్‌లను సందర్శించి మద్యం లేదా పానీయం తాగినట్లు ప్రతి పబ్‌ నుంచి రశీదులు, సాక్షి సంతకాలు కూడా సేకరించాడట. ఈ విషయంలో అతనికి ముగ్గురు స్నేహితులు సహకరించారు. తన పానీయాల జాబితాలో బీర్, ‘బేబీ గిన్నిస్‌’ షాట్స్, టకీలా, లేగర్‌ మొదలైనవి ఉన్నట్లు క్రింప్‌ తెలిపాడు.

ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల మేర ‘పానీయాలు’ సేవించడం వల్ల తాను ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చిందని... 17 గంటల సమయంలో దీనికే ఎక్కువ సమయం పోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకోసం ఇదంతా చేశావంటే.. కేన్సర్‌తో మృతిచెందిన తన కుక్క జ్ఞాపకార్థంతోపాటు శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు క్రింప్‌ వివరించాడు.

మరిన్ని వార్తలు