వైరల్‌: నిలువ నీడ లేదని రూ.12 లక్షలు, బాధితుడి కంటతడి

30 Mar, 2021 15:37 IST|Sakshi

వాషింగ్టన్‌: మనిషి కష్టాన్ని చూసి సానుభూతి చూపించే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి సాయం చేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అమెరికాలోని కనెక్టికట్‌లో మైక్‌ అనే వ్యక్తి తల దాచుకోవడానికి కూడా నిలువ నీడ లేని దుస్థితిలో ఉన్నాడు. 46 ఏళ్ల వయసున్న ఇతగాడు ఓ రోజు ఫిలిప్‌ వ్యూ అనే వ్లోగర్‌ కారు అద్దాలు తుడవడానికి వెళ్లాడు. అయితే అతడు అందుకు ససేమీరా అనడంతో చేసేదేం లేక బయట ఒంటరిగా దీనంగా కూర్చుండిపోయాడు. ఇది చూసిన ఫిలిప్‌ అతడి మీద జాలిపడి కారులోకి పిలిచి తినడానికి సాండ్‌విచ్‌ ఇచ్చాడు. నెమ్మదిగా మాటలు కలుపుతూ అతడి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు.

అతడు ఎంతో కష్టకాలంలో ఉన్నాడని అర్థమైన ఫిలిప్‌ వారు మాట్లాడుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అతడి మాటల్లోనే తెలుసుకున్న నెటిజన్లు ఆయనకు ఎలాగైనా సాయం చేయాలనుకున్నారు. అలా ఎంతోమంది మైక్‌కోసం వేలాది డాలర్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో వీరి కోసం ఫిలిప్‌ 'గో ఫండ్‌ మీ' పేజ్‌ ఏర్పాటు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 10 వేల డాలర్లు పోగయ్యాయి. తాజాగా ఈ అమౌంట్‌ 17 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.12 లక్షలు)కు చేరింది. దీన్నంతటినీ ఫిలిప్‌ తక్కువ కాలంలోనే తనకు మంచి ఫ్రెండ్‌ అయిన మైక్‌కు అందజేసి ఆశ్చర్యపరిచాడు. ఆ డబ్బంతా ఇక నీ సొంతమని చెప్పడంతో క్షణకాలం పాటు నమ్మలేకపోయిన మైక్‌ ఆ వెంటనే కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

కాగా చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన మైక్‌ కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడట. ఏమైందో ఏమోకానీ తర్వాత తన కుటుంబానికి కూడా దూరమై ఒంటరిగా జీవిస్తున్నాడు. ఉండటానికి ఇల్లు కూడా లేని అతడి రియల్‌ లైఫ్‌ స్టోరీ విన్న నెటిజన్లు పెద్ద మనసుతో 12 లక్షల రూపాయలు ఇవ్వడంతో మైక్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లోనూ వైరల్‌గా మారింది.

చదవండి: వైరల్‌: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్‌ ఆట

ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. భారీ పార్శిల్

మరిన్ని వార్తలు