వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోతున్న ట్రంప్‌..?!

7 Nov, 2020 08:55 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్‌ (77) మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన గెలుపు ఇక లాంఛనమే కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రవారం వెలువడిన ఫలితాలను బట్టి ఇక్కడ బైడెన్‌ది పైచేయిగా ఉంది. ఇక సోషల్‌ మీడియాలో ట్రంప్‌ మీద ట్రోలింగ్‌ ఓ రేంజ్‌లో నడుస్తుంది. ఎన్నికల గురించి ట్రంప్‌ తప్పుడు ప్రచారం చేస్తుండటంతో విమర్శకులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది. అధ్యక్షభవనం బయట ఉన్న ఓ మూవింగ్‌ ట్రక్కు నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమైన పత్రాలు, హర్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్తున్నారని.. వెండి వస్తువులను తరలించడానికి ట్రంప్‌ ట్రక్కు మాట్లాడుకున్నారని కామెంట్‌ చేస్తున్నారు. వివరాలు.. ఈ వీడియోలో ఓ పసుపు రంగు ట్రక్కు అధ్యక్ష భవన ప్రధాన ద్వారం ఎదురుగా ఉంది. ట్రక్కు మీద ఉన్న అక్షరాలు సరిగా కనబడటం లేదు. నెటిజనులు మాత్రం ఈ ట్రక్కును పెస్న్కే కంపెనీకి చెందినదిగా భావిస్తున్నారు. (చదవండి: ‘‘చిల్ డొనాల్డ్‌ చిల్‌’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్‌)

ఇక ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయినప్పటి నుంచి దీని మీద బోలేడు జోకులు, వ్యంగ్య వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలిసింది కదా. అందుకే ట్రంప్ వైట్‌హౌస్‌ నుంచి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారనుకుంటాను అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కానీ చాలామంది నెటిజనులు మాత్రం ‘ట్రంప్‌ వైట్‌హౌస్‌లోని పెయింటింగ్స్‌, పురాతన వస్తువులను తరలిస్తున్నాడో ఏమో.. ఎవరికి తెలుసు’.. ‘తను చేసిన స్కాములకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌, ఫైల్స్‌ని తీసుకెళ్లడానికి ట్రక్కు మాట్లాడుకున్నాడేమో’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఇది నిజమేనా.. వైట్‌హౌస్‌ బయట ట్రక్కు ఉండటం వింతగా ఉంది’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు