దేశం మారినా..  మీ బుద్ధి మాత్రం మారదు కదా

1 Dec, 2021 20:05 IST|Sakshi

న్యూయార్క్‌ భారత కాన్సులేట్ ఆఫీసులో మహిళకు చేదు అనుభవం

వీడియో షేర్‌ చేసిన గరేవాల్‌.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజనులు

వాషింగ్టన్‌: దేశం కాని దేశంలో మనవాళ్లకు ఏదైనా ప్రమాదం వాటిల్లినా.. ఆపద వచ్చినా.. కాన్సులేట్‌ అధికారులు ఆదుకుంటారనే నమ్మకం ఉంటుంది. కాన్సులేట్‌ అధికారులంటే విదేశాల్లో ఉన్న వారికి.. ఇక్కడ వారి కుటుంబీకులకు మధ్య వారధిగా ఉండాలి. కానీ మన దగ్గర కొందరు ప్రభుత్వ అధికారుల్లో ఒక లాంటి మనస్తత్వం ఉంటుంది. తాము ఇతరులకంటే అతీతులమని ఫీలవుతుంటారు. తాము ఉన్నది ప్రజా సేవకు అనే విషయం మర్చిపోయి.. సామాన్యులతో చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా అలానే ప్రవర్తిస్తారు. దేశం మారినా వీరి బుద్ధి మాత్రం మారదు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాక్‌ షో వ్యాఖ్యాత సిమి గరేవాల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో వివరాలు..  

న్యూయార్క్‌ భారత కాన్సులేట్‌లో నవంబర్‌ 24న ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిలో ఓ  మహిళ కాన్సులేట్‌ అధికారితో మాట్లాడుతూ ఉంటుంది. సదరు మహిళ తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఆమె ఇండియా వెళ్లడానికి వీసా కోసం అప్లై చేస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫీజు అన్ని సబ్మిట్‌ చేసినప్పటికి.. కాన్సులేట్‌ అధికారి ఆమెకు వీసా నిరాకరిస్తాడు. ఆమె తన పరిస్థితిని వివరించి.. వీసా మంజూరు చేయాల్సిందిగా కోరుతుంది. 
(చదవండి: ‘చెత్త’ అపార్ట్‌మెంట్‌ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!)

కానీ ఆ అధికారి ఆమె మాటలను అసలు పట్టించుకోడు. పైగా చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆమె సబ్మిట్‌ చేసిన డాక్యుమెంట్స్‌ని కూడా విసురుగా పడేస్తాడు. ఆమె ఎంత బ్రతిమిలాడుతున్నా.. ఆమె వాదన వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోతాడు. అయితే అంతసేపు జరిగిన తతంగాన్నంత ఆమె వీడియో తీస్తుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్‌ సదరు మహిళ వద్దకు వచ్చి వీడియో తీయోద్దని కోరతాడు.
(చదవండి: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌: ‘న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్.. డబ్బా వాలీ’)

ఈ వీడియోని సిమి గరేవాల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసిన సదరు కాన్సులేట్‌ అధికారి ప్రవర్తన సరికాదని ట్వీట్‌ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరలయ్యింది. చాలా మంది న్యూయార్క్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు చాలా సహజం అని.. అక్కడి అధికారులు ఇంతే రూడ్‌గా ప్రవర్తిస్తారని గతంలో తమకు ఎదురైన అనుభవాలను షేర్‌ చేశారు. సదరు అధికారిని నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. 

చదవండి: తమ్ముడి కోసం చిట్టితల్లి సాహసం

మరిన్ని వార్తలు