Video Viral: ప్యాసింజర్‌ షార్ట్‌ టెంపర్‌.. దెబ్బకు ఫ్లైట్‌ జర్నీ చేయనీకుండా జీవితకాల నిషేధం!

23 Sep, 2022 14:20 IST|Sakshi

కొంతమందికి చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేస్తుంటాయి. దీంతో ముందు వెనుక ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించి లేనిపోనీ తంటాలను కొని తెచ్చుకుంటారు. ఇక్కడో ఒక విమాన ప్రయాణికుడు అలానే ప్రవర్తించి జీవితంలో విమాన ప్రయాణమే చేయనీకుండా నిషేధింపబడ్డాడు. 

వివరాల్లోకెళ్తే... మెక్సికోలోని ఒక అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ లాస్‌ కాబోస్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో జీవితంలో అసలు ప్లైట్‌ జర్నీ చేసేందుకు లేకుండా నిషేధం విధించింది. ఈఘటన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 377 విమానంలో చోటు చేసుకుంది. ఒక విమాన సహయకుడుని నన్ను బెదిరిస్తున్నావా అంటూ ఒక ప్రయాణికుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు.

సదరు ప్రయాణికుడు పిడికిలితో ఫ్లైట్‌ అటెండెంట్‌ తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో సదరు అటెండెంట్‌ ఈ ఆకస్మిక దాడికి వెంటనే కిందపడిపోయాడు. వాస్తవానికి సదరు ఫ్లైట్‌ అటెండెంట్‌ ప్రయాణికుడి ప్రవర్తన విషయమై కంప్లైంట్‌ చేసేందుకు వెళ్తున్నసమయంలోనే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ అనుహ్య ఘటనకి విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ విమానంలోని ఒక హోస్ట్‌ గాయపడిన అటెండెంట్‌కి సపర్యలు కూడా చేసింది.

ఈ ఘటనతో ఆగ్రహం చెందిన అమెరికా విమాన ఎయిర్‌లైన్స్‌ వెంటనే స్పందించి...ఈ దాడికి పాల్పడిన  వ్యక్తి 33 ఏళ్ల అలెగ్జాండర్‌ తుంగ్‌ క్యూ లేగా గుర్తించి అతన్ని వెంటనే విమానం నుంచి దించేయడమే కాకుండా జీవితకాలం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అంతేగాదు తమ సిబ్బందిని గాయపరిచినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

విచారణలో నేరం రుజువైతే సదరు ప్రయాణికుడికి 20 ఏ‍ళ్లు జైలు శిక్ష పడుతుందని కూడా పేర్కొంది. ఈ మేరకు అమెరికా ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటన విడుదల చేసింది కూడా. తమ ఎయిర్‌లైన్స్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించి దాడి చేస్తే... చూస్తూ ఊరుకోమని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి)

మరిన్ని వార్తలు