Viral Video: అక్కడ లాక్‌డౌన్‌ పేరు చెబితే చాలు జనాలు పరుగో....పరుగు...

16 Aug, 2022 12:16 IST|Sakshi

చైనా: ప్రంపంచ దేశాలన్నింటిని గత రెండేళ్లుగా పట్టిపీడించిన కరోనా మహమ్మారీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను పలు చోట్ల పునరుద్ధరించారు కూడా. చైనాలో మాత్రం కరోనా పగ సాధిస్తున్నట్లుగా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో చైనా అధికారులు ప్రజలను వరుస లాక్‌డౌన్‌లతో నిర్బంధించి,  కఠిన ఆంక్షలు విధించారు.

జీరో కోవిడ్‌ వ్యూహం ప్రజల్లో తీవ్ర అసహనానని రేకిత్తించింది. అది ఎంతలా మారిందంటే వారు లాక్‌డౌన్‌ అని చెబితే చాలు పరుగులు తీసి బయటకు వచ్చేసేంతగా విసిగిపోయారు. ఈ మేరకు చైనాలో ఒక ఐకియా స్టోర్‌లో కరోనాకి కేసుల ట్రేసింగ్‌లో భాగంగా స్టోర్‌ లాక్‌డౌన్‌ చేస్తున్నామని అనౌన్స్‌మెంట్‌ ఇలా రాగానే ఒక్కసారిగా ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆఖరికి సెక్యూరిటీ సిబ్బంది డోర్‌లు మూసేందుకు యత్నించినా.. బాబాయ్‌ ఇక మా వల్ల కాదంటూ దూకాణంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గుంపులుగా తోసుకుంటూ బయటకి పరుగులు తీశారు.

ఇటీవలే టిబెట్‌లోని లాసా నుంచి షాంఘై వచ్చిన ఆరేళ్ల బాలుడి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ స్టోర్‌ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ బాలుడికి కరోనా రావడానికి ముందు ఆ ఐకియా దుకాణంలోని సుమారు 400 మందితో టచ్‌లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఐకియా స్టోర్‌ని లాక్‌డౌన్‌ చేయాని అధికారులు నిర్ణయించి ప్రజలకు అనౌన్సమెంట్‌ ఇచ్చారు. అంతే ఒక్కసారిగా ప్రజల్లోంచి అసహనం కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, అధికారులు వారిని బయటకు రాకుండా నియంత్రించ లేకపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: చైనా కక్ష పూరిత చర్య! తైవాన్‌ అధికారుల పై ఆంక్షల మోత)

మరిన్ని వార్తలు