బనానా రికార్డు! అరటి పళ్ల ప్రదర్శన

12 Jun, 2022 14:09 IST|Sakshi

Banana Bonanza: అరటి పండ్లను ఇలా వరుసగా పేర్చారేమిటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలోని షికాగోకు చెందిన జ్యువెల్‌ ఓస్కో అనే సూపర్‌ మార్కెట్‌ స్టోర్‌ నిర్వాహకులు ఇలా పండ్లను పేర్చడం ద్వారా సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఇందులో పెద్ద గొప్పేం ఉంది.. ఎవరైనా ఈ రికార్డు సృష్టించొచ్చు అనుకుంటున్నారా? కానీ ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు మరి.. ఇందుకోసం వాడిన అరటిపండ్లు ఎన్నో తెలిస్తే మీరు అవాక్కవుతారు.. ఎందుకంటే ఏకంగా 31,751 కిలోల అరటిపండ్లను ఇలా వరుసగా పేర్చారు.

అంటే ఒక్కో అరటిపండు సుమారు 100 గ్రాముల బరువు ఉంటుందనుకుంటే ఈ రికార్డు కోసం వాడిన అరటిపండ్ల సంఖ్య సుమారు 3 లక్షలన్నమాట! ఇలా అరటిపండ్లను వరుసగా పేర్చడానికి స్టోర్‌ నిర్వాహకులకు 3 రోజుల సమయం పట్టిందట. ఈ రికార్డుతో బ్రెజిల్‌లో 2016లో 18,805.83 కిలోల అరటిపండ్లను పేర్చడం ద్వారా నమోదైన గిన్నిస్‌ రికార్డు తెరమరుగైంది. గిన్నిస్‌ ప్రతినిధులు ఈ రికార్డును ధ్రువీకరించాక ఆ అరటిపండ్లలో కొన్నింటిని సూపర్‌ మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులకు నిర్వాహకులు పంచిపెట్టారు. మిగిలిన వాటిని ఉత్తర ఇల్లినాయీ ఆహార బ్యాంకుకు పంపారు.

(చదవండి: దురదృష్టకరమైన ఘటన... గాయపడిన పక్షిని రక్షించడమే శాపమైంది)

మరిన్ని వార్తలు