ఈ పిల్లల ఫన్నీ వీడియో ఎంత ధర పలికిందో తెలుసా?

26 May, 2021 17:26 IST|Sakshi

పసి పిల్లలు ఏం చేసినా చూడటానికి ముచ్చటగా, ముద్దుగానే ఉంటాయి.  కొన్మి సందర్భాల్లో వాళ్ల అల్లరి మనకు కడుపుబ్బా నవ్వను కూడా తెప్పిస్తాయి.  అందుకే కొందరు తల్లిదండ్రులు వాళ్ల పిల్లల చిలిపి మాటలను, అల్లరి పనులను వీడియో తీస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల ఫన్నీ వీడియో వేలంలో భారీ మొత్తంలో అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది.

వేలంలో 5.5 కోట్లు పలికింది 
2007లో యూట్యూబ్‌లో ‘చార్లీ బిట్ మై ఫింగర్’ అనే వీడియోను అపలోడ్‌ చేశారు. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పటికే సుమారు 880 మిలియన్ వ్యూస్ పైగా రాబట్టింది. ఇటీవల నిర్వహించిన వేలంలో ఈ వీడియో ఏకంగా రూ.5.5 కోట్లకు అమ్ముడుపోవడం ఓ సంచలనంగా మారింది. ఈ వీడియోకు నాన్ ఫంజిబుల్ టోకెన్ పద్దతి (ఎన్ఎఫ్‌టి)లో వేలంపాట నిర్వహించగా 11 దేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్‌టి ( నాన్‌ ఫంజిబల్‌ టోకన్స్‌ ) అంటే ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులని అర్థం. వీటిని బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

వేలు కొరికాడు.. వైరల్‌గా మారింది
ఈ వీడియోలో చార్లీ డేవిస్ కార్ అనే బుడ్డోడు.. తన అన్న హ్యారీ డేవిస్ కార్ సరదాగా వేలును కొరుకుతాడు. దాంతో మరోసారి నోట్లో వేలు పెట్టడంతో ఇంకా గట్టిగా కొరుకుతూ కాసేపు అలా నోట్లోనే ఉంచుతాడు. దీంతో కొరికిన బుడ్డోడు నవ్వులతో... కొరికించిన పెద్దోడు కన్నీళ్లతో మనకు కనిపిస్తారు. ఫన్నీ వీడియో అందరికీ తెగ నచ్చేసింది.  కాగా ఇటీవల ఈ వీడియోను వేలంలో పెట్టగా, 5.5 కోట్లకు అమ్ముడు కావడంతో ప్రస్తుతం ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. గతంలో ఇదే తరహాలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే మొట్టమొదటి ట్వీట్‌ను కూడా ఎన్ఎఫ్‌టి పద్ధతిలో 2.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.

చదవండి: ‘అవును.. తప్పు చేశా.. నేరం అంగీకరిస్తున్నా’

మరిన్ని వార్తలు