అభివృద్ధికి ‘రోడ్‌’మ్యాప్‌లు

8 Jun, 2023 03:27 IST|Sakshi

ఎటైనా వెళ్లాలంటే.. బండి తీశామా, రోడ్డెక్కామా అంతే. వేరే పట్టణానికో, రాష్ట్రానికో వెళ్లాలంటే.. కారులోనో, బస్సులోనో హైవే ఎక్కాల్సిందే. కొన్ని హైవేలు అయితే వందలు, వేల కిలోమీటర్ల మేర సాగుతూనే ఉంటాయి. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎంత పొడవున రోడ్లు ఉన్నాయో తెలుసా? మన దేశంలో ఉన్న రోడ్ల లెక్క ఏమిటో తెలుసా? దీనిపై తాజాగా ‘విజువల్‌ క్యాపిటలిస్ట్‌’సంస్థ ఓ అధ్యయనం చేయించి ‘రోడ్ల’లెక్కలు తేల్చింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మొత్తంగా కోట్ల కిలోమీటర్లు 
ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హైవేల నుంచి గ్రామీణ రోడ్ల దాకా.. మొత్తం రహదారుల పొడవు సుమారు 2.1 కోట్ల కిలోమీటర్లపైనే. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన భూమ్మీద రోడ్ల పొడవు.. 35 సార్లు చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చినంత అన్నమాట.

ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 200కుపైగా దేశాలు ఉంటే.. మొత్తం రోడ్ల విస్తీర్ణంలో ఒక్క అమెరికాలోనే 14 శాతానికిపైగా ఉండటం గమనార్హం. విజువల్‌ క్యాపిటలిస్ట్‌ సంస్థ కోరిన మేరకు పైథాన్‌ మ్యాప్స్‌ సంస్థ ఈ అధ్యయనం చేసింది. ‘గ్లోబల్‌ రోడ్స్‌ ఇన్వెంటరీ ప్రాజెక్ట్‌ (జీఆర్‌ఐపీ)’లోని రోడ్ల డేటాను సేకరించి.. వివిధ దేశాలు, ప్రాంతాల వారీగా క్రోడీకరించింది.  

ఏ దేశంలో.. ఎంత పొడవుతో.. 
ప్రపంచవ్యాప్తంగా 222 దేశాల్లో కలిపి మొత్తం రోడ్ల విస్తీర్ణం 2,16,00,760 కిలోమీటర్లు. ఇందులో 30 లక్షల కిలోమీటర్లకుపైగా పొడవైన రోడ్లతో యూఎస్‌ఏ టాప్‌లో నిలిచింది. 17 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో చైనా, పది లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో భారత్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని మొత్తం రహదారుల విస్తీర్ణంలో కేవలం ఈ మూడు దేశాల్లోనే 25 శాతానికిపైగా ఉండటం గమనార్హం. 

ఇక ఆండోరా, జీబ్రాల్టర్, వాలిస్‌ అండ్‌ ఫ్యుచురా ఐలాండ్స్, లీచెన్‌స్టీన్, పలౌ, అమెరికన్‌ సమోవా, ఫ్రెంచ్‌ సదరన్‌–అంటార్కిటిక్‌ ఐలాండ్స్, బెర్ముడా, క్రిస్‌మస్‌ ఐలాండ్స్, నార్‌ఫ్లోక్‌ ఐలాండ్‌ తదితర దేశాల్లో రోడ్ల విస్తీర్ణం 30 కిలోమీటర్లలోపే కావడం విశేషం. 

రోడ్ల విస్తీర్ణంలో మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ 27వ (1,83,317 కి.మీ), పాకిస్తాన్‌ 38వ (1,06,183 కి.మీ), శ్రీలంక 43వ (96,023 కి.మీ) స్థానాల్లో ఉన్నాయి. 

హైవేలలో చైనా.. స్థానిక రోడ్లలో అర్జెంటీనా.. 
 భారీ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలు వంటి వాటిని పరిశీలిస్తే.. ప్రపంచంలో చైనా (6,83,248 కి.మీ) టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో అ­మెరికా (3,66,800), మెక్సికో (1,05,822), జపాన్‌ (94,451), కెన­డా (91,173), బ్రెజిల్‌ (86,772), ఫ్రాన్స్‌ (74,956), ఇండియా (69,748), అర్జెంటినా (69,188), ఆ్రస్టేలియా (69,138) నిలిచాయి. 
 మధ్య స్థాయి హైవేల పొడవులో.. ప్రపంచంలో అమెరికా (8,98,873 కి.మీ) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా (5,12,386 కి.మీ), ఇండియా (4,13,790 కి.మీ), చైనా (3,06,176 కి.మీ), బ్రెజిల్‌ (2,23,662 కి.మీ), మెక్సికో (1,81,088కి.మీ), ఫ్రాన్స్‌ (1,14,433కి.మీ) తదితర దేశాలు నిలిచాయి. 
 జిల్లా, మండల స్థాయి రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే.. అర్జెంటీనా (534,876 కి.మీ) ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో ఇండియా (526,130 కి.మీ), ఆ్రస్టేలియా (426,346 కి.మీ), చైనా (373,831 కి.మీ), ఇండోనేషియా (334,164 కి.మీ), కొలంబియా (309,725 కి.­మీ), బ్రెజిల్‌ (283,933 కి.మీ) తదితర దేశాలు ఉన్నాయి. 
 పూర్తిగా స్థానిక, గ్రామీణ స్థాయి రోడ్లు అమెరికా (17,89,534 కి.మీ), చైనా (3,46,742 కి.మీ), జర్మనీ (3,01,853 కి.మీ) ఎక్కువగా ఉన్నాయి. 

ఎలాంటి రోడ్లు ఉంటే ఏమిటి? 
విజువల్‌ క్యాపిటలిస్ట్‌ విశ్లేషణ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్‌ వేలు, భారీ హైవేలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, పట్టణీకరణకు సంకేతాలు. ఎక్కువ ఖర్చు పెట్టగల దేశాలు మాత్రమే వీటిని నిర్మించగలుగుతాయి. 
♦ మధ్యస్థాయి హైవేలు అభివృద్ధి చెందుతున్న, పట్టణీకరణ పెరుగుతున్న ప్రాంతా­లకు సూచికలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని నిర్మిస్తున్నాయి.  
♦ జిల్లా, మండల, స్థానిక రోడ్లు.. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తాయి. 
మొత్తంగా రహదారుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం సుస్థిర అభివృద్ధికి సూచిక అని.. మౌలిక సదుపాయాల వల్ల అభివృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.  

మరిన్ని వార్తలు