Afghanisthan: అఫ్గాన్‌కు భారీ స్థాయిలో ఆర్థికసాయం!

15 Sep, 2021 00:55 IST|Sakshi

ఐరాస పిలుపు మేరకు వెల్లువెత్తిన అంతర్జాతీయ సమాజం దాతృత్వం

ఐక్యరాజ్య సమితి/జెనీవా: తాలిబన్లు చెరబట్టిన అఫ్గాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్‌ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ వెల్లడించారు.

ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్‌ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తెల్సిందే. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్‌ కోరడం విదితమే. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్‌ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. నా అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. అఫ్గాన్‌కు అంతర్జాతీయ సమాజం ఎంతటి భారీ స్థాయిలో ఆర్థిక తోడ్పాటు ఇస్తుందనడానికి ఈ ఘటనే తార్కాణం’ అని స్విట్జర్లాండ్‌ నగరం జెనీవాలో పత్రికా సమావేశంలో గుటెర్రస్‌ చెప్పారు.

‘తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్‌ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ తాలిబన్ల దురాక్రమణ, కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద వేలాది మంది అఫ్గాన్‌ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్‌ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్‌ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు