రష్యా సైన్యంతో కలిసి స్నైపర్‌ రైఫిల్‌ పేల్చిన పుతిన్‌.. దాడులు మరింత ఉధృతం

22 Oct, 2022 13:18 IST|Sakshi

ఉక్రెయిన్‌లో కొద్దిరోజులుగా రష్యా సైన్యం దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులు, రెండు దేశాలకు చెందిన సైన్యం మృత్యువాతపడ్డారు. ఇంత జరిగినా పుతిన్‌ మాత్రం దాడులను నిలిపివేయడం లేదు. 

కాగా, ఉక్రెయిన్‌లో రష్యా దళాలు దాడుల జరుపుతున్న సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లో ఉన్న రియాజాన్‌లోని సైనిక శిక్షణా కేంద్రాన్ని పుతిన్‌ సందర్శించారు. యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగతంగా వెళ్లి సైనిక సిబ్బందితో మాట్లాడారు. వారిని మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ఈ సందర్భంగానే యుద్ధరంగలో పుతిన్‌ ఒక స్నైపర్‌ రైఫిల్‌ను కాల్చడం విశేషం.  

రియాజాన్‌లోని సైనిక శిక్షణా కేంద్రం వద్ద పుతిన్‌ కళ్లద్దాలు, చెవులకు రక్షణనిచ్చే పరికరాలు ధరించి కనిపించారు. అనంతరం, సైనికులు కాల్పులు జరిపే ఒక నెట్‌లోపల ముందుకు వంగి స్నైపర్‌ రైఫిల్‌ను పేల్చారు. గన్‌ పేల్చిన అనంతరం.. పుతిన్‌ చిరునవ్వు చిందించారు. పుతిన్‌ పక్కనే ఉన్న ఓ సైనికుడి చేయి పట్టుకుని యుద్ధ రంగంలో దూసుకెళ్లాలి అన్నట్టుగా సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు