ప్రపంచానికి పెను సవాల్‌ విసిరిన పుతిన్‌.. అదే జరిగితే భారీ విధ్వంసమే..?

8 Oct, 2022 15:19 IST|Sakshi

ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా తయారైంది రష్యా. చిన్నదేశం ఉక్రెయిన్‌పై  ఏకపక్ష యుద్ధానికి కాలు దువ్వింది. పెను విధ్వంసం సృష్టించినా ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా నిలబడటంతో తడబడుతోంది వ్లాదిమిర్‌ పుతిన్ సేన. దీంతో, ఇప్పుడు అణుబాంబును అటక మీద నుంచి దింపి.. ప్రయోగిస్తానంటూ పుతిన్‌ బెదిరిస్తున్నాడు. మరోవైపు రష్యాలో సైన్యంలోకి పనికొచ్చే వయసున్న అందరినీ బలవంతంగా ఆర్మీలో చేర్చే  ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో లక్షలాది మంది మాకొద్దీ ఆర్మీ జాబ్ అంటూ దేశం విడిచి పోతున్నారు.

ప్రపంచానికి పెనుముప్పు..
రష్యా బాధ్యతారహితంగా అణ్వాయుధాలను ప్రయోగిస్తే మాత్రం ప్రపంచం పెను ముప్పులోకి జారిపోవడం ఖాయం. ప్రపంచాన్ని అశాంతిలోకి నెట్టేసేలా  అణ్వాయుధాలతో  భూమండలాన్ని హింస పెట్టేలా  రష్యా అధ్యక్షుడు పుతిన్ బాధ్యతారహిత వ్యాఖ్యలు, నిర్ణయాలతో దుర్మార్గంగా దూసుకుపోతున్నాడు. ఉక్రెయిన్‌లో లక్షలాది మంది ఉసురు పోసుకున్న పుతిన్‌.. హింస అక్కడితో ఆపేదేలే అంటున్నారు. రష్యా ఆయుధాగారంలో అణ్వాయుధాలు కూడా ఉన్నాయి తెలుసా? అని బెదిరిస్తున్నారు. అవసరమైతే అణుబాంబు ప్రయోగించడానికి కూడా ఏమాత్రం వెనుకాడబోమని భయపెడుతున్నాడు. పుతిన్  ఆలోచనలను వ్యతిరేకిస్తోన్న లక్షలాది మంది రష్యన్లు దేశానికి గుడ్ బై చెప్పి పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పారిపోతున్నారు.

పారిపోదాం బ్రదర్..!
రష్యా సరిహద్దుల్లో ప్రత్యేకించి జార్జియా, ఫిన్‌లాండ్‌ దేశాల వైపు సరిహద్దుల్లో నిత్యం ఇలా జనం పోటాపోటీగా తమ కార్లలో, బస్సుల్లోనూ దేశం విడిచిపోతున్న దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు అయితే దేశం నుండి ఎవరూ పారిపోకుండా ఉండేందుకు వీలుగా సరిహద్దులను మూసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు. రష్యా అధినేత పుతిన్ మనసులో పుట్టిన యుద్ధ కాంక్ష నెలల తరబడి రగులుతూనే ఉంది. అది రేపిన సెగలు ఉక్రెయిన్‌పై విధ్వంస సంతకాలు చేస్తూనే ఉన్నాయి.

పెరుగుతున్న అసహనం..
నెలలు గడిచే కొద్దీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో అసహనం పెరిగిపోతోంది. ఉక్రెయిన్ ఇంత ప్రతిఘటన ఇవ్వగలగడానికి కారణం దానికి నాటో దేశాల ఆయుధ సరఫరానే అని పుతిన్ భావిస్తున్నారు. అందుకే నాటో దేశాలనూ, మిగతా ప్రపంచ దేశాలనూ భయపెట్టేలా పుతిన్ ఓ ప్రకటన చేశారు. అవసరమనుకుంటే అణుబాంబులు పేల్చడానికి కూడా వెనకాడేదిలేదని పుతిన్ అల్టిమేటం జారీ చేశారు. ఈ బెదిరింపు ఉక్రెయిన్ ప్రభుత్వానికా? నాటో కూటమికా? లేక పెద్దన్న అమెరికాకా? అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, తేలికపాటి అణ్వాయుధాలను  ప్రయోగించడం ద్వారా ఉక్రెయిన్ ఆర్మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని పుతిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అణుబాంబు పేలుస్తా అంటూ  హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు