Russia Ukraine War: రష్యా దాడులు సక్సెస్‌.. ‘విముక్తి’ అంటూ పుతిన్‌ సంచలన ప్రకటన

22 Apr, 2022 05:24 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన

ఈగ కూడా నగరంలోకి పోకూడదని ఆదేశాలు

కీవ్‌: ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్‌ తమ వశమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురువారం ప్రకటించారు. నగరంలో మిగిలిన ఉక్రెయిన్‌ బలగాలను వెతికే పని పెట్టుకోకుండా బయటనుంచి ఎలాంటి సాయం అందకుండా కట్టుదిట్టం చేయాలని తన సేనలకు సూచించారు. చాలారోజులుగా ఈ నగరాన్ని వశం చేసుకోవాలని రష్యా యత్నిస్తోంది. దీనివల్ల రష్యన్లకు క్రిమియాతో నేరుగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. నగరంలోని స్టీల్‌ ప్లాంట్‌ దిగువన ఉన్న సొరంగాల్లో పలువురు ఉక్రెయిన్‌ సైనికులు పొంచి ఉండొచ్చని రష్యా అనుమానిస్తోంది. వీరంతా లొంగిపోవాలని పలుమార్లు అల్టిమేటం కూడా జారీ చేసింది.

కానీ తాజాగా స్టీల్‌ప్లాంట్‌ స్వాధీనం కాకుండానే నగరం వశమైనట్లు పుతిన్‌ ప్రకటించుకున్నారు. మారియుపోల్‌ విముక్తి విజయవంతమైందన్న ఆయన తన సేనలు అభినందనలు తెలిపారు. అయితే నగరం చేజిక్కిందన్న రష్యా ప్రకటనను ఉక్రెయిన్‌ అవహేళన చేసింది. స్టీల్‌ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోలేమని రష్యన్లకు అర్థమైందని, వాళ్లకు అక్కడ భారీ నష్టం సంభవించిందని జెలెన్‌స్కీ సలహాదారు ఒలెక్సీ చెప్పారు. అయితే ప్లాంటుతో సంబంధం లేకుండా కీలకమైన నౌకాశ్రయం సహా నగరం రష్యా స్వాధీనమైందని నిపుణులు తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు దక్కిన తొలి పెద్ద విజయం ఇదే కావడం గమనార్హం.
 

ఇది చదవండి: ప్రాధాన్యం సంతరించుకున్న బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన

స్టీల్‌ప్లాంట్‌ త్వరలో స్వాధీనం!
నగరంలోని స్టీల్‌ ప్లాంట్‌లో దాదాపు 2వేల మంది ఉక్రెయిన్‌ సైనికులున్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు చెప్పారు. ఈ ప్లాంట్‌ కింద దాదాపు 24 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు దాదాపు 11 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించిఉన్నాయి. దీనికి నగరంలోని ఇతర ప్రాంతంతో ఉన్న సంబంధాలను నిలిపివేశామని, ప్లాంట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని ఆయన చెప్పారు. ప్లాంట్‌లో దాదాపు వెయ్యిమంది పౌరులు, 500మంది గాయపడ్డ సైనికులు ఉన్నారని ఉక్రెయిన్‌ తెలిపింది. ప్లాంట్‌లోకి చొచ్చుకుపోయే ఆలోచన అనవసరమని, అలా చేయవద్దని ఆదేశించానని పుతిన్‌ తెలిపారు. తన సైనికుల ప్రాణాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

బదులుగా  ఒక్క ఈగ కూడా లోపలకి పోకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని బ్లాక్‌ చేయమని ఆదేశించానని చెప్పారు. లోపలున్నవాళ్లు ఆహారం, ఆయుధాల కొరతతో స్వచ్ఛందంగా లొంగిపోతారని రష్యా నాయకత్వం యోచిస్తోంది. నగరం నుంచి పౌరులు వెళ్లేందుకు అనుమతించాలని జర్మనీ సహా పలు దేశాలు రష్యాను కోరుతున్నాయి. ఇకపై డోన్బాస్‌ స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారిస్తామని అధికారులు చెప్పారు. ఇందుకోసమే ఖార్కివ్‌ నగరంపై దాడిని ముమ్మరం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సాయాన్ని మరింత పెంచుతామని అమెరికా, వివిధ పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి.  

మరిన్ని విశేషాలు
► రష్యా పౌర హననానికి పాల్పడుతుందంటూ లాట్వియా పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రష్యా చమురు దిగుమతిని ఈయూ దేశాలు తక్షణం నిలిపివేయాలని కోరింది.  
► ఉక్రెయిన్‌ యుద్ధంలో సంధిని పాటించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ మరోమారు పిలుపునిచ్చారు. కాథలిక్‌ ఈస్టర్‌ సందర్భంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస చీఫ్‌ విజ్ఞప్తితో ఏకీభవిస్తున్నానని తెలిపారు.
► రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్యదేశాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని, అందువల్ల ఈయూలో చేరడంపై పునరాలోచిస్తామని సెర్బియా మంత్రి అలెక్సాండర్‌ చెప్పారు.  
► ఆంక్షల భయంతో రష్యాలో బ్యాంకింగ్‌ సేవలకు చైనా క్రెడిట్‌ కార్డ్‌ సంస్థ యునియన్‌ పే వెనుకాడిందని వార్తలు వచ్చాయి.
► జెలెన్‌స్కీతో చర్చల కోసం స్పెయిన్, డెన్మార్క్‌ ప్రధానులు కీవ్‌కు వచ్చారు.
► లుహాన్స్‌క్‌ ప్రాంతంలో 80 శాతం ప్రస్తుతం రష్యా అధీనంలో ఉందని ఆ ప్రాంత గవర్నర్‌ వెల్లడించారు. రష్యా దాడికి ముందు ఇందులో 60 శాతం ఉక్రెయిన్‌ ఆధీనంలో, 40 శాతం తిరుగుబాటుదారుల అధీనంలో ఉండేది.
► ఉక్రెయిన్‌కు అదనపు మిలటరీ, ఆర్థిక సాయం అందించే ప్యాకేజీని జోబైడెన్‌ ప్రకటిస్తారని అమెరికా అధికారులు తెలిపారు.
► యూఎస్‌కు చెందిన కెనడీ అవార్డుకు జెలెన్‌స్కీతో పాటు ఐదుగురిని ఎంపిక చేశారు.  

ఇది చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కుబేరుడు తీవ్ర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు