Russia Ukraine War: యుద్ధం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన పుతిన్‌

13 Apr, 2022 05:12 IST|Sakshi

ఆంక్షలను తట్టుకుని నిలిచాం: పుతిన్‌ 

పాశ్చాత్య దేశాలకే బెడిసి కొడతాయి 

అవిప్పటికైనా తెలివి తెచ్చుకోవాలి 

చర్చలకు ఉక్రెయిన్‌ తూట్లు పొడిచిందని ధ్వజం 

కొనసాగుతున్న బాంబుల వర్షం

కీవ్‌: పాశ్చాత్య దేశాల ఆంక్షల దాడిని రష్యా విజయవంతంగా తట్టుకుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఆంక్షలు అంతిమంగా వాటికే బెడిసికొడతాయన్నారు. ‘‘రష్యా, బెలారస్‌ ఎరువుల ఎగుమతులపై నిషేధం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలకు రెక్కలొస్తాయి. ఇది అంతిమంగా అంతర్జాతీయ ఆహార కొరతకు, వలసలకు దారి తీస్తుంది’’ అన్నారు. ‘‘విదేశీ శక్తులు మమ్మల్ని ఎప్పటికీ ఏకాకి చేయలేవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశాన్నీ ఏకాకిగా మార్చలేం. రష్యా వంటి అతి పెద్ద దేశం విషయంలో అది అసలే సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు.

బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకోతో కలిసి ఆయన మంగళవారం తూర్పు రష్యాలోని వొస్తోచ్నీ స్పేస్‌ లాంచ్‌ స్టేషన్‌ను సందర్శించారు. పశ్చిమ దేశాలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రష్యా వ్యతిరేక స్థావరంగా మారిందంటూ ఉక్రెయిన్‌పై మండిపడ్డారు. ‘‘నయా నాజీయిజం, జాతీయ అతివాదం అక్కడ బలంగా వేళ్లూనుకున్నాయి. అందుకే మా దేశ భద్రత కోసం ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగాల్సి వచ్చింది. మాకు మరో దారి లేకపోయింది’’ అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ ప్రాంత ప్రజలను కాపాడటమే తమ లక్ష్యమన్నారు.

సైనిక చర్య ప్రణాళిక మేరకు సాగుతోందని, లక్ష్యం సాధించే దాకా కొనసాగి తీరుతుందని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌ వెనకడుగు వేయడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు. పుతిన్‌ వాదనను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు కొట్టిపారేశాయి. మతి లేని యుద్ధాన్ని సమర్థించుకోవడానికి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నాయి. కీవ్‌ సమీపంలో ఉక్రెయిన్‌ ఆయుధాగారాన్ని, మరో చోట యుద్ధ విమానాల హాంగర్‌ను దీర్ఘ శ్రేణి క్రూయిజ్‌ క్షిపణులతో ధ్వంసం చేసినట్టు రష్యా చెప్పింది. భారీ రష్యా సైనిక కాన్వాయ్‌ ఇజుమ్‌ నగరం వైపు వెళ్తున్నట్టు అమెరికా తెలిపింది.

విద్యుత్‌ గ్రిడ్‌పై రష్యా సైనిక హాకర్ల దాడిని తిప్పికొట్టినట్టు ఉక్రెయిన్‌ చెప్పింది. మారియుపోల్‌లో రష్యా సేనలు విషపూరిత రసాయనాలను ప్రయోగించాయని ఉక్రెయిన్‌ అనుమానం వెలిబుచ్చింది. దీన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు ఖండించారు. అదే జరిగితే ఏం చేయాలో తమకు తెలుసని ఇంగ్లండ్‌ చెప్పింది. రష్యాతో వర్తక, వాణిజ్యసంబంధాలను యూరప్‌ ఇప్పటికీ కొనసాగిస్తుండటం దారుణమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. రష్యాలోని ప్రధాన బ్యాంకులు, 400 మంది వ్యక్తులను కూడా ఆంక్షల పరిధిలోకి తెస్తున్నట్టు జపాన్‌ ప్రకటించింది. నోకియా కంపెనీ కూడా రష్యా మార్కెట్‌ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. మరోవైపు యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎరువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఉక్రెయిన్‌లో నిరాశ్రయుల సంఖ్య కోటి దాటిందని ఐరాస శరణార్థుల సంస్థ పేర్కొంది. 50 లక్షల దాకా దేశం వీడారంది.

మరిన్ని వార్తలు