‘మాక్స్‌డోమ్‌’ మళ్లొచ్చింది

4 May, 2022 02:31 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సంబంధించిన విమానం ‘ఇల్యుమిష్‌ ఐఎల్‌–80 మాక్స్‌డోమ్‌’(విపత్తు సమయంలో వాడేది) తాజాగా వార్తల్లోకి వచ్చింది. తాజాగా మాస్కో చుట్టూ ఈ విమానం చక్కర్లు కొట్టడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఆకాశంలో ఎగిరే ‘క్రెమ్లిన్‌’(రష్యా అధ్యక్ష భవనం) అంటుంటారీ విమానాన్ని. అణు యుద్ధం లాంటివి సంభవించినప్పుడు రష్యాను పాలించడం దగ్గర్నుంచి విమానం నుంచే అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇందులో ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో ఈ విమానం కనబడటంతో ఉత్కంఠ నెలకొంది. అసలీ విమానం విశేషాలేంటో తెలుసుకుందామా..

►సోవియట్‌ కాలానికి చెందిన ఈ విమానానికి అవసరమైన ఇంధనాన్ని ఆకాశంలోనే నింపుకోవచ్చు. ఇందుకోసం కాక్‌పిట్‌ కింద ఏర్పాటు ఉంది. 
►విమానంలో నుంచే రష్యాను పరిపాలించేందుకు, ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశంలో నుంచే మిలిటరీకి ఆదేశాలు జారీ చేయొచ్చు..అంతేకాదు..  అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
►కాక్‌పిట్‌కు తప్ప విమానానికి ఇంకెక్కడా కిటికీలు ఉండవు.
►విమానంలో ముఖ్యమైన భాగం జ్వెనో–ఎస్‌. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్‌ గది ఉంది. విమానంపైన ముందు భాగంలో ఏర్పాటు చేసిన శాటిలైట్‌ యాంటెన్నాల సాయంతో ఇది పని చేస్తుంది. 
►సముద్రంలోని సబ్‌మెరైన్లలో (బాలిస్టిక్‌ క్షిపణులను కలిగి ఉండేవి) ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు వెరీలో ఫ్రీక్వెన్సీ యాంటెన్నా వ్యవస్థ కూడా ఉంది.    
►1987లో తొలి విమానం తయారైంది. మొత్తం 4 తయారు చేశారు. 2008లో ఈ విమానాలను ఆధునీకరించారు. జ్వెనో–ఎస్‌ రెండో వెర్షన్‌ను తయారు చేశారు. దీన్ని రెండు విమానాల్లో ఏర్పాటు చేశారు.    
►విమానం పొడవు 60 మీటర్లు, రెక్కల పొడవు 48 మీటర్లు ఉంటుంది.
►గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒకసారి ఇంధనం నింపాక 3,600 కిలోమీటర్లు వెళ్లగలదు.

2010 నుంచి కనిపించలే
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఆ విజయానికి గుర్తుగా ఏటా జరిగే కార్యక్రమంలో ఈ విమానం కనిపిస్తుండేది. అయితే 2010 నుంచి కనిపించకుండాపోయింది. తాజాగా మళ్లీ కనిపించి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఈ విమానాన్ని పుతిన్‌ మళ్లీ బయటకు తెచ్చారని అనుకుంటున్నారు. అయితే దీనిపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. మే 9న విక్టరీ డే పరేడ్‌లో విమానం కనిపించనుందని, అందులో భాగంగా రిహార్సల్స్‌ చేసేందుకే మాస్కో చుట్టూ చక్కర్లు కొట్టిందని వెల్లడించింది.  
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌   

మరిన్ని వార్తలు