వీడియో: నిప్పులు కక్కిన రాకాసి పర్వతం.. హైఅలర్ట్‌.. హాహాకారాలతో జనం పరుగులు

5 Dec, 2022 11:44 IST|Sakshi

జకార్తా: ద్వీప దేశాల్లో అగ్ని పర్వతాలు బద్ధలు కావడం తరచూ చూసేది. అయితే.. పసిఫిక్‌ రీజియన్‌లోని అగ్నిపర్వతాలు బద్ధలు కావడం తరచూ తీవ్రతకు దారి తీస్తుంటాయి కూడా. అందునా రాకాసి అగ్నిపర్వతంగా పేరున్న సెమెరూ వల్ల జరిగే నష్టం మరీ తీవ్రంగా ఉంటోంది. 

తాజాగా.. ఇండోనేషియా జావా తూర్పు ప్రాంతంలోని గునుంగులో హైఅలర్ట్‌ ప్రకటించారు. దాదాపు 3,676 మీటర్ల ఆదివారం సెమెరూ  అగ్నిపర్వతం బద్ధలు కావడంతో..  వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు అధికారులు. కిందటి నెలలో అగ్నిపర్వతం ధాటికి 300 మంది దాకా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు అగ్నిపర్వత ముప్పుపై అక్కడ ఆందోళన నెలకొంది.

తూర్పు జావాలో అతిపొడవైన అగ్నిపర్వంగా సెమెరూకి పేరుంది. సోమవారం భారీ శబ్ధం చేసుకుంటూ నిప్పులు కక్కింది ఈ రాకాసి అగ్నిపర్వతం. లావా భారీగా పల్లపు ప్రాంతానికి వస్తోంది. ఈ ప్రభావంతో ఎనిమిది కిలోమీటర్ల మేర జనాలను తిరగనివ్వకుండా జోన్‌గా ప్రకటించారు అధికారులు. హుటాహుటిన రంగంలోకి దిగి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అయితే తేలికపాటి వర్షం.. ప్రమాద తీవ్రత నుంచి కొంత ఉపశమనం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఇదే రాకాసి అగ్నిపర్వతం కిందటి ఏడాది బద్ధలైన ఘటనలో.. యాభై మందిదాకా పొట్టనబెట్టుకుంది. వేల మందిని అక్కడి నుంచి తరలిపోయేలా చేసింది. ఇదిలా ఉంటే..పసిఫిక్‌ తీరంలో చిన్న ద్వీప సమూహాలున్న ఇండోనేషియా.. భూమిపై అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతం బద్ధలుకు సంబంధించిన కొన్ని భయానక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. భయంతో జనాలు పరుగులు పెడుతుండగా.. గాయపడిన కొందరిని చికిత్సకు తరలిస్తున్నవి వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు