ఎగిరిపోతే ఎంత బాగుంటుంది!

10 Mar, 2021 14:23 IST|Sakshi

ట్రాఫిక్‌ తలనొప్పులు లేకుండా సరిౖయెన టైమ్‌కు మనల్ని గమ్యస్థానం చేర్చే ఎయిర్‌ ట్యాక్సీలు రాబోతున్నాయి. ఆకాశమార్గంలో పట్టాలెక్కబోయే ఎయిర్‌ట్యాక్సీ ప్రాజెక్ట్‌లలో ఇండియా నుంచి జర్మనీ వరకు యువత కీలక పాత్ర పోషిస్తుంది. జర్మన్‌ కంపెనీ ‘వోలోకాప్టర్‌’ ఎయిర్‌ట్యాక్సీల ట్రెండ్‌కు మార్గదర్శిగా నిలిచింది. ‘ఏమిటి? ఎయిర్‌ ట్యాక్సీనా?’ అనే ఆశ్చర్యం ‘అవును ఇది నిజం’ అనే నమ్మకానికి రావడానికి ఎంతోకాలం పట్టలేదు. 2011లో మొదలై రెండు సంవత్సరాలు గడిచేసరికి తొలి 2-సీటర్‌ ప్రోటోటైప్‌ను రూపొందించారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు లైసెన్స్‌ వచ్చింది. మరో రెండు సంవత్సరాలకు అయిదు వందల ప్లేన్‌లు తయారుచేశారు. 

‘సేఫ్‌ అండ్‌ స్టేబుల్‌’ కాన్సెప్ట్‌తో అర్బన్‌ ఎన్విరాన్‌మెంట్‌లో ప్యాసింజర్‌ను భద్రంగా గమ్యస్థానానికి ఎలా చేర్చాలి? అధిక శబ్దాలను నియంత్రిస్తూ టేకింగ్‌ ఆఫ్, ల్యాండింగ్‌...ఇలా ఎన్నో విషయాలలో జాగ్రత్తలు తీసుకొని, తేలికపాటి బరువుతో ఎయిర్‌ఫ్రేమ్‌లు తయారుచేశారు. గంట నుంచి 5 గంటల వరకు తీసుకునే ఛార్జింగ్‌ సమయాన్ని సెకండ్లకు పరిమితం చేసి స్మూత్‌రైడ్‌కు బాటలు వేశారు. ‘ప్రయోగాలేవో చేస్తున్నాం, మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే అనుమతి లభిస్తుందా? అనే పెద్ద డౌట్‌ వచ్చింది. కమర్శియల్‌ ఎయిర్‌ లైనర్స్‌లాగే వీటికి అత్యున్నతమైన భద్రతాప్రమాణాలు రూపొందించుకోవడంతో అనుమతి సులభమైంది’ అంటున్నాడు ‘వోలోకాప్టర్‌’ కోఫౌండర్‌  అలెగ్జాండర్‌ లోసెల్‌. 

ఎయిర్‌ట్యాక్సీ అయినంత మాత్రానా ధరలు ఆకాశంలో ఉంటాయనుకోనక్కర్లేదు. ధరలు అందుబాటులోనే ఉంటాయట. బ్రిస్టల్‌(యూకే)కు చెందిన  ఫ్లైయింగ్‌ ట్యాక్సీ సర్వీస్‌ కంపెనీ ‘వెర్టికల్‌ ఎరో స్పేస్‌’ 2016 నుంచే రకరకాల ప్రయోగాలు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎయిరోస్పేస్‌ అండ్‌ టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌లను ఈ ప్రాజెక్ట్‌ కోసం వాడుకున్నారు. 800 కీ.మీ దూరం ప్రయాణం చేసే పవర్‌ఫుల్‌ మోడల్‌ సెట్‌ను ఈ కంపెనీ తయారుచేసింది. ‘సిటికీ దూరంగా ఉన్న విమానాశ్రయాలకు వెళ్లడానికే  చాలా సమయం వృథా పోతుంది. ఎయిర్‌ ట్యాక్సీల ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుంది’ అంటున్నాడు ‘వెర్టికల్‌ ఎరో స్పేస్‌’ ఫౌండర్‌ స్టీఫెన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌.రెండు  దశబ్దాల కిందటి తన కలను పదకొండు సంవత్సరాలు కష్టపడి నిజం చేసుకున్నాడు కాలిఫోర్నియాకు చెందిన జోబెన్‌. ‘జోబి ఎవియేషన్‌’  వ్యవస్థాపకుడైన జోబెన్‌-‘ ఎయిర్‌ ట్యాక్సీలతో ఆకాశం కళకళలాడే రోజులు ఎంతో దూరంలో లేవు’ అంటున్నాడు. జోబి ఏవియేషన్‌కు చెందిన రూఫ్‌ టాప్‌-టు-రూఫ్‌ టాప్‌ ఎయిర్‌ ట్యాక్సీలు 2023లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక మన దగ్గరకు వస్తే... ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌ ట్యాక్సీలు ఊపందుకుంటున్న దశలో ఇప్పుడు అందరి దృష్టి ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేటెడ్‌ స్టార్టప్‌ ‘ఇ-ప్లేన్‌ కంపెనీ’పై  పడింది. సీడ్‌ ఫండింగ్‌ ఆశాజనకంగా ఉండడంతో వరల్డ్‌క్లాస్‌ ఇంజనీరింగ్‌ టీమ్‌ను తయారుచేసుకునే వీలు ఏర్పడుతుంది. ఎరో స్పేస్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ చక్రవర్తి ఆయన శిష్యుడు ప్రంజల్‌ మెహతా మానసపుత్రిక ‘ఇ-ప్లేన్‌’ కంపెనీ. ఈ 2 సీటర్‌ ‘ఇ ప్లేన్‌’కు  ‘వెర్టిపోర్ట్స్‌’ అవసరం లేదు. రూఫ్‌ టాప్, పార్కింగ్‌ లాట్స్‌ నుంచే టేక్‌ ఆఫ్‌ చేయవచ్చు. రాబోయే కాలంలో ‘ఎయిర్‌ ట్యాక్సీ’ల ప్రయోగం విజయవంతం అయితే ‘శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి’ అని కాస్త గట్టిగానే నమ్మవచ్చు.

చదవండి:

ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా!

ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా!

మరిన్ని వార్తలు