మాల్‌లో గుచ్చుకున్న మేకు.. రూ.75 కోట్ల పరిహారం

4 Dec, 2021 17:50 IST|Sakshi

అమెరికాలో ఓ మహిళ షాపింగ్‌ కోసం వాల్‌మార్టు మాల్‌కు వెళ్లితే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె మాల్‌లోకి ప్రవేశించి షాపింగ్‌ చేస్తున్న సమయంలో కాలికి తుప్పుపట్టిన ఇనుప మేకు గుచ్చుకుంది. చిన్న గాయం కాస్త ఇన్‌ఫెక్షన్‌గా మారటంతో  ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ కాలును కోల్పోవటంతో ఆరేళ్లపాటు వీల్‌ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఘటన 2015 సౌత్‌ కరోలినాలోని వాల్‌ మార్టులో చోటు చేసుకుంది.

అయితే ఈ ఘటనలో బాధితురాలైన ఏప్రిల్ జోన్స్ అనే మహిళ 2017లో వాల్‌మార్టు యాజమాన్యంపై నష్టం పరిహారం కేసును ఫ్లోరెన్స్ కౌంటీలోని కోర్టులో దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 10 మిలియన్‌ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని వాల్‌ మార్టును ఆదేశించింది. ఆమె తరఫున వాదనలు జరిపిన అనస్టోపౌలో న్యాయ సంస్థ న్యాయవాదులు.. ఏప్రిల్ జోన్స్ ఆరేళ్లపాటు వీల్‌ ఛైర్‌కే పరిమితమైందని, ఆమె జీవితం ఈ ఘటన ద్వారా చెల్లాచెదురై ఇబ్బందులు ఎదుర్కొందని కోర్టుకు వివరించారు.

వారి వాదనలను సమర్ధిస్తూ బాధిత మహిళకు 10 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 75 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ప్రొస్తెటిక్‌ కాలును కొనుగోలు చేయడానికి.. భవిష్యత్తు వైద్య బిల్లులను కవర్ చేయడానికి నష్టం పరిహారం డబ్బును ఉపయోగిస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయసంస్థ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు