మూతి పగులగొడతా: బ్రెజిల్ అధ్యక్షుడు

24 Aug, 2020 09:02 IST|Sakshi

విలేకరిపై బ్రెజిల్ అధ్యక్షుడు నోటి దురుసు

బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. బోల్సొనారో భార్య,  ప్రథమ మహిళ మిచెల్లి బోల్సోనారోపై  అవినీతిపై  వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించిన విలేకరిపై మండిపడ్డారు.  మూతి వాయగొడతానంటూ బెదిరింపులకు దిగడం  నిరసనలకు దారి తీసింది. 

బ్రెసిలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్‌ పర్యటన సందర్భంగా బోల్సొనారో భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఒక విలేకరి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహోదగ్నుడైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. దీంతో ఇతర జర్నలిస్టుల నిరసనలకు దిగారు. కానీ ఇవేమీ పట్టించుకోని అధ్యక్షుడు అక్కడినుంచి నిష్క్రమించారు. జైర్ బోల్సొనారో బెదిరింపులపై పత్రిక స్పందించింది. ఒక ప్రభుత్వ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఆయన తన కర్యవ్యాన్ని విస్మరించారని విమర్శించింది. వృత్తిపరంగా తన విధిని నిర్వర్తించారంటూ భాధిత జర్నలిస్టు, తమ ఉద్యోగికి మద్దతుగా నిలిచింది.

కాగా ఒక అవినీతి కేసులో రిటైర్డ్ పోలీసు అధికారి, బోల్సొనారో సన్నిహితుడు ఫాబ్రిసియో క్యూరోజ్‌, మిచెల్లి మధ్య అక్రమ లావాదేవీలపై క్రూసో పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. క్యూరోజ్‌ ప్రస్తుత సెనేటర్‌, ఆమె కుమారుడు ఫ్లావియో బోల్సోనారోకు మాజీ సలహాదారు కూడా. 2019 జనవరిలో జైర్ బోల్సోనారో అధ్యక్షుడయ్యే ముందు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు కూడా జరుగుతోంది. అయితే ఈ నిధులను ఫ్లావియో బోల్సోనారో రియోడి జనీరోలో ప్రాంతీయ చట్టసభ సభ్యుడిగా సమయం 2011-2016 మధ్య మిచెల్లి బ్యాంకు ఖాతాలో క్యూరోజ్  నిధులను జమ చేశారని  ఈ కథనం పేర్కొంది.  ఈ వ్యవహారంపై  మిచెల్లి  బోల్సొనారో ఇంకా  స్పందించాల్సి ఉంది. 

>
మరిన్ని వార్తలు