Russia Ukraine War: రష్యా దూకుడు.. ఉక్రెయిన్‌ భూభాగాల విలీనంపై రిఫరెండం షురూ

24 Sep, 2022 08:46 IST|Sakshi

కీవ్‌: ఆక్రమిత ఉక్రెయిన్‌ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది. లుహాన్‌స్క్, ఖేర్సన్‌తోపాటు జపోరిజియా, డోనెట్‌స్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఇది మంగళవారం దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్‌ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్‌ ఈనెల 27న ముగియనుంది.

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని, సరిహద్దులను సవరించుకుంటే, వాటిజోలికి ఎవరూరారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతామండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా ఆయన అణు హెచ్చరికలు చేశారు. మరోవైపు.. రష్యా ఆక్రమించుకున్న 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. రిఫరెండంపై పశ్చిమ దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: పుతిన్‌ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం.. భయాందోళనతో దేశం బయటకు!

>
మరిన్ని వార్తలు