మొదలైన మాటల యుద్ధం

1 Oct, 2020 04:22 IST|Sakshi
చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న ట్రంప్, బైడెన్‌

వాడివేడిగా సాగిన యూఎస్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌

ట్రంప్, బైడెన్‌ మధ్య హోరాహోరీ

దుమ్మెత్తి పోసుకున్న అభ్యర్థులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తుగా సాగే ప్రెసిడెన్షియల్‌ డిబేట్లలో తొలి డిబేట్‌ బుధవారం హోరాహోరీగా జరిగింది. రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ పార్టీల తరఫు అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్, జో బైడెన్‌ ఒకే వేదికపై చేరి పలు అంశాలపై  వైఖరిని వెల్లడించారు. డిబేట్‌లో ఒక దశలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఈ డిబేట్లను ఉపయోగించుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకం, పెరుగుతున్న జాత్యహంకార ధోరణులు, వాతావరణ ఒప్పందాలు, పన్నులు, కరోనా అంశాలపై వీరు తమ వైఖరులను తెలియజేస్తూ ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించారు.

ఒకరు మాట్లాడుతుండగా మరొకరు అడ్డు రావడం వంటివి జరిగాయి. వారిని సముదాయించి చర్చను సజావుగా సాగించేందుకు వ్యాఖ్యాత క్రిస్‌ వాలెస్‌ చెమటోడాల్సివచ్చింది. కరోనా కారణంగా వారు షేక్‌హ్యాండ్‌  చేసుకోలేదు.  కానీ, మాస్కు కూడా ధరించలేదు. ఎన్నికలకు 35 రోజులుండగా, ఒపీనియన్‌ పోల్స్‌లో ట్రంప్‌ కాస్త వెనుకంజలో ఉన్నారు. బైడెన్‌కు సైతం పెద్దగా మద్దతేమీ కనిపించడం లేదు. దీంతో డిబేట్ల ద్వారా జనాన్ని ఆకట్టుకోవాలని వారు భావిస్తున్నారు. చర్చలో రెండు మార్లు భారత్‌ ప్రస్తావన తెచ్చారు. కరోనా మరణాల సంఖ్య చెప్పని దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. కర్బన ఉద్గారాల విషయంలో చైనా, భారత్‌పై కట్టడి లేదన్నారు.


ఇండో అమెరికన్ల మిశ్రమ  అభిప్రాయం
తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌పై ఇండో అమెరికన్ల అభిప్రాయం మిశ్రమంగా ఉంది. ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్‌ పార్టీ సమర్థక ఇండో అమెరికన్లు అభిప్రాయపడగా, బైడెన్‌ విజయవంతంగా డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్‌ పార్టీ సమర్థ కులు భావిస్తున్నారు. ట్రంప్‌ డిబేట్‌లో బైడెన్‌ను చితక్కొట్టాడని ట్రంప్‌ విక్టరీ ఇండియన్‌ అమెరికన్‌ ఫైనాన్స్‌ కమిటీ ప్రతినిధి ఆల్‌మాసన్‌ అభిప్రాయపడ్డారు. డిబేట్‌ వ్యాఖ్యాత డెమొక్రాట్లకు మద్దతుగా ఉన్నారని కాలిఫోర్నియా అటార్నీ, రిపబ్లికన్‌ నేత హర్మీత్‌ థిల్లాన్‌ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివారు డిబేట్‌లో పాల్గొనకుండా చూడాలని సొంత పార్టీ నేతలను కోరారు. ట్రంప్‌ మరోమారు అధ్యక్ష పదవికి అనర్హుడని బైడెన్‌ నిరూపించారని సౌత్‌ఏసియన్స్‌ ఫర్‌ బైడెన్‌ ప్రతినిధి నేహా దివాన్‌ చెప్పారు. ట్రంప్‌ తప్పిదాలను బైడెన్‌ సరిదిద్దగలనని నిరూపించారని అజయ్‌ జైన్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు