ఉన్నట్టుండి వాషింగ్‌ మిషిన్‌ ఢాం!! అని పేలింది..

1 Apr, 2021 14:33 IST|Sakshi
ప్రమాద దృశ్యాలు

ఈడిన్‌బర్గ్‌ : మన శ్రమను తక్కువ చేసే యంత్రాలు.. కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఓ వస్తువని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ప్రతీ వస్తువు ఏదో ఒక సందర్భంలో మనల్ని ప్రమాదంలో పడేయోచ్చు. ఇందుకు స్కాట్‌లాండ్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. గ్లాస్గోకు చెందిన మిస్‌ లారా బిర్రెల్‌ కొద్దిరోజుల క్రితం వాషింగ్‌ మిషిన్‌లో బట్టలు వేసి, ఇంట్లో వేరే పనులు చేసుకోవటానికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఆ వాషింగ్‌ మిషిన్‌ ఢాం!! అని పేలింది. పేలుడు దాటికి అది ముక్కలు అయిపోయి సొట్టలు పడింది. వంట గది కూడా దెబ్బతింది. బాంబు పేలిన శబ్ధం రావటంతో ఆమె అక్కడికి వెళ్లి చూసింది. వాషింగ్‌ మిషిన్‌లోంచి పొగలు రావటం గమనించి, పవర్‌ సప్లై స్విచ్ఛ్‌ను ఆఫ్‌ చేసింది.

దీనిపై బిర్రెల్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు వాషింగ్‌ మిషిన్‌ను ఆన్‌ చేసి వెళ్లొద్దని చెప్పటం నేను విన్నాను. కానీ, ఈ రోజు నేను వాషింగ్‌ మిషిన్‌ను ఆన్‌ చేసి బయటకు వెళ్లలేదు. అయినా అది పేలింది. నేను బాంబు పేలిందేమో అనుకున్నాను. పొగలు రావటం చూసి అక్కడికి వెళ్లాను. వాషింగ్‌ మిషిన్‌ ముక్కలై ఉంది. కిచెన్‌ కూడా చాలా వరకు పాడైంది. ఇంకోసారి వాషింగ్‌ మిషిన్‌ను వదలి బయటకు వెళ్లను. ప్రమాదం జరిగిన సందర్భంలో నేను కానీ, మా వాళ్లు కానీ, ఉండి ఉంటే ఏమయ్యేదో ఊహించలేకుండా ఉన్నాను’’ అని పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

చదవండి, చదవించండి : కడుపుతో ఉన్న మహిళ మళ్లీ గర్భం దాల్చింది

మరిన్ని వార్తలు