వాషింగ్టన్‌లో హై అలర్ట్‌

19 Jan, 2021 03:50 IST|Sakshi
క్యాపిటల్‌ భవనం వద్ద నేషనల్‌ గార్డ్స్‌ గస్తీ

బైడెన్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా అల్లర్లకు అవకాశం

రంగంలోకి 25 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్‌లో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి. అత్యంత పటిష్ట భద్రతాచర్యలతో వాషింగ్టన్‌ను అష్టదిగ్బంధనం చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు. వేలాది స్థానిక పోలీసులతో పాటు, సుమారు 25 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. క్యాపిటల్‌ భవనం, వైట్‌హౌజ్‌లతో పాటు నగరంలోని ప్రధాన భవనాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్‌ భవనం, వైట్‌హౌజ్‌ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు.

ఆయా భవనాల బయట 8 అడుగుల ఎత్తైన ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులతో కిక్కిరిసే నేషనల్‌ మాల్‌ను  మూసేశారు. వాషింగ్టన్‌తో పాటు 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడతామంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ అనుకూల బృందాలతో పాటు వివిధ గ్రూపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయని, దాంతో, ఆయా బృందాలపై, ట్రంప్‌ అనుకూల వర్గాలపై, జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడిలో పాల్గొన్న వారిపై సునిశిత దృష్టి పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

‘కోవిడ్‌ నిబంధనల కారణంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అసాధారణంగా జరగబోతోంది. ఎంపిక చేసిన కొద్దిమంది అతి«థులు పాల్గొంటారు. అయితే, జనవరి 6 నాటి ఘటన నేపథ్యంలో భద్రతను మరింత పెంచాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ పేర్కొన్నారు. ‘దేశ పౌరులే క్యాపిటల్‌ భవనంపై దాడి చేసి, పోలీసు అధికారులను చంపేస్తారని ఊహించలేదు. కానీ, అది జరిగింది. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందే’ అన్నారు. వాషింగ్టన్‌లోనే కాకుండా, ప్రధాన నగరాల్లో హింస చెలరేగే అవకాశముందని ఎఫ్‌బీఐ  నివేదికల్లో హెచ్చరించింది. ‘ప్రమాణ స్వీకారం పూర్తయ్యేవరకు భద్రత బలగాలు దూకుడుగానే వ్యవహరిస్తాయి’ అని ఎఫ్‌బీఐ చీఫ్‌ క్రిస్టఫర్‌ స్పష్టం చేశారు.

సొంత  బలగాల  నుంచే ముప్పు?
బైడెన్‌కు భద్రత కల్పించే దళాల్లోని వ్యక్తుల నుంచే ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు అమెరికా రక్షణ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దాంతో, ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతలో, నగర రక్షణలో పాలు పంచుకుంటున్న మొత్తం 25 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను నిశితంగా పరీక్షిస్తున్నారు. ఈ అంతర్గత దాడి ముప్పు గురించే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని ఆర్మీ సెక్రటరీ రయాన్‌ మెక్‌ కెర్తి పేర్కొన్నారు. బైడెన్‌పై, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులపై దాడికి పాల్పడే అవకాశమున్న వారిని గుర్తించేందుకు పలు విధాలుగా గార్డ్స్‌ను పరీక్షిస్తున్నామన్నారు. దాడి చేసేందుకు వారికి లభించే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుని.. దాడులను అడ్డుకునే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

విప్లవ కాలం నాటి దుస్తులు ధరించి, రైఫిల్‌తో కొలంబస్‌లోని ఒహాయో స్టేట్‌హౌస్‌ ముందు కనిపించిన ఓ వ్యక్తి  

మరిన్ని వార్తలు