వైరల్‌ వీడియో.. ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి

13 Jun, 2021 17:02 IST|Sakshi

అంకారా: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారేమో.. కానీ కుక్కలు మాత్రం అలాకాదు! అందుకే చాలా మంది  శునకాలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. వాటికి స్నానం చేయించటం దగ్గర నుంచి మంచి ఆహారం పెట్టడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తూ వారితో ప్రేమగా ఆడుకుంటాయి. ఒక్కోసారి తమ యజమాని కనిపించకపోతే  తల్లడిల్లిపోతాయి. ఆహారం కూడా తినకుండా ఎదురుచూస్తాయి.

ఇక యజమాని రాగానే, వారి చుట్టూ తిరుగుతూ.. తోక ఆడిస్తూ.. నాకుతూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటాయి. ఎవరైనా యజమానితో దురుసుగా మాట్లాడినా, కొట్టడానికి వెళ్లినా వారిపై దూకి దాడి చేస్తాయి. కాగా, ఇప్పటికే శునకాలు, తమ యజమానుల పట్ల ప్రదర్శించే ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.

వివరాలు.. ఇ‍స్తాంబుల్‌లోని బుయుకడా ఐలాండ్‌లోని ఒక మహిళ అనారోగ్యానికి గురై, కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఆ మహిళ ఒక శునకాన్ని పెంచుకునేది. అయితే, ప్రతిరోజు తనతో ఆడుకునే యజమాని లేవకుండా ఒకే దగ్గర ఉండటాన్ని చూసి కుక్క తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు తన యజమాని దగ్గరకు వెళ్లడం నోటితో నాకుతూ.. కదిలించటానికి ప్రయత్నించేది. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బంధువులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆ కుక్క కూడా అంబులెన్సు వెనుక పరిగెడుతూ ఆసుపత్రికి చేరుకుంది. ఆ తర్వాత, యజమానిని ఆసుపత్రి గదిలోకి తరలించారు. అయితే, శునకం మాత్రం.. తన యజమాని కోసం ఆసుపత్రి బయట కూర్చుని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే శునకాలే నయం’, ‘ఆ మహిళ నిజంగా అదృ‍‍ష్టవంతురాలు’, ‘ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి..’, ‘ఆ మహిళ తొందరగా కొలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్‌ వీడియో

మరిన్ని వార్తలు