కారు ఇంజిన్‌లో కొండచిలువ.. ఎలా వచ్చిందబ్బా!

1 Nov, 2020 19:07 IST|Sakshi

ఫ్లోరిడా : అప్పుడప్పుడు మన జీవితంలో అనుకోని ఘటనలు ఎదురవడం సహజం. తాజాగా ఫ్లోరిడాకు చెందిన మోర్ బ్లూమెన్‌ఫెల్డ్ అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. సరదాగా బయటికి వెళ్దామని భావించి అతను తన ఫోర్డ్‌ ముస్తాంగ్‌ కారును స్టార్ట్‌ చేశాడు. కానీ కారు ఇంజిన్‌ లైట్‌ పనిచేయకపోవడంతో కారు స్టార్ట్‌ అవ్వలేదు. దీంతో ఇంజిన్‌ చెక్‌ చేద్దామని క్యాబిన్‌ ఓపెన్‌ చేశాడు. ఇంజిన్‌ క్యాబిన్‌ ఓపెన్‌ చేసి చూసిన మోర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. కారణం అప్పటికే ఇంజిన్‌ భాగంలో దాదాపు పది అడుగుల కొండచిలువ చుట్టుకొని ఉంది. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే)

దీంతో భయాందోళనకు గురైన మోర్‌ వెంటనే వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి ఫోన్‌ చేయగా వారు స్పందించారు. ఆ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది వచ్చి కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా డానియా బీచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. కాగా కొండచిలువ బర్మా ప్రాంతానికి చెందినదని అధికారులు పేర్కొన్నారు. అధికారులు కొండచిలువను కారు ఇంజిన్‌ నుంచి బయటకు తీస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద కొండచిలువ కారు ఇంజిన్‌లోకి ఎలా దూరిందబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : పవిత్రమైన మక్కాలో కారుతో హల్‌చల్)‌

మరిన్ని వార్తలు