Watery Portal Glory Hole: వింత రంధ్రం.. మనుషుల తంత్రం!

13 Apr, 2022 05:00 IST|Sakshi

ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. డ్యామ్‌లో ఏదో పెద్ద రంధ్రం ఏర్పడి నీళ్లు లోపలికి వెళ్లిపోతున్నాయని అనిపిస్తోంది కదా. కానీ ఇది మనుషులు ఏర్పాటు చేసిన రంధ్రమే. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలీ రంధ్రం ఎక్కడ ఉంది.. ఎందుకు ఏర్పాటు చేశారు.. దీని లాభనష్టాలేంటి.. తెలుసుకుందాం.

డ్యామ్‌లో నీటి నియంత్రణకు.. 
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తూర్పు నప లోయలో మోంటిసెల్లో డ్యామ్‌ ఉంది. 1950ల్లో ఈ ఆనకట్టను కట్టారు. అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు ఈ డ్యామ్‌లో నిండిన నీళ్లు బయటకు వెళ్లేలా ఇంజినీర్లు ఓ భారీ పైపును (రంధ్రంలా) ఏర్పాటు చేశారు. 22 మీటర్ల వెడల్పు, 75 మీటర్ల పొడవుతో దాన్ని నిర్మించారు.

ఈ పైపు నుంచి మరో చిన్న పైపు ద్వారా అర కిలోమీటరు దూరంలోని పుటాహ్‌ క్రీక్‌లోకి నీళ్లను తరలించేలా ఏర్పాటు చేశారు. పైన ఫొటోలో చూస్తున్న రంధ్రం ఈ పైపే. ఈ రంధ్రం సెకనుకు దాదాపు 48 వేల క్యూబిక్‌ అడుగుల నీటిని లాగేసుకోగలదు. ఈ రంధ్రాన్ని స్థానిక ప్రజలు ‘గ్లోరీ హోల్‌’ అని ముద్దుగా పిలుచుకుంటారు. డ్యామ్‌లో నీటిని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఇలాంటి రంధ్రాలను ‘బెల్‌ మౌత్స్‌’ అంటుంటారు. ప్రపంచంలోని చాలా డ్యామ్‌లలో ఈ విధానం పాటిస్తున్నారు.  

2017 నుంచి వార్తల్లో.. 
వర్షాలు విపరీతంగా కురవడం, ఈ పైపు నుంచి నీళ్లు బయటకు వెళ్లడం లాంటి పరిస్థితులు 50 ఏళ్లకోసారి వస్తే రావొచ్చని అప్పట్లో ఇంజనీర్లు అనుకున్నారు. అయితే 2000 సంవత్సరం మొదలయ్యాక ఇప్పటికే చాలాసార్లు ఈ హోల్‌లో నుంచి నీళ్లు బయటకు వెళ్లాయి. 2017లో భారీ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు ఈ బెల్‌ మౌత్‌ వార్తల్లో నిలిచింది. చాలా మంది స్థానికులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు. 2019లో కూడా వర్షాలు భారీగా కురవడంతో మరోసారి ఈ హోల్‌ దర్శనమిచ్చింది.     
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

మనుషులు వెళ్లకుండా.. 
సుడిగుండం లాంటి ఈ రంధ్రం దగ్గరకు మనుషులు వెళ్లకుండా అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. అటువైపు స్విమ్మింగ్, బోటింగ్‌ నిషేధించారు. పైగా ఈ రంధ్రంలోని నీళ్లు వెళ్లే వేగానికి వ్యతిరేకంగా ఈత వచ్చిన ఎవరైనా బయటకు రాగలని చెబుతున్నారు. ఈ రంధ్రంలో పడి మనుషులు చనిపోయిన ఘటన ఇప్పటివరకు ఒక్కటే జరిగింది. 1997లో ఓ మహిళ అందులో పడి చనిపోయింది. ఆ రంధ్రంలో పడటానికి 20 నిమిషాల ముందు వరకు తను రంధ్రం అంచున వేలాడుతూ కనిపించింది. రెస్క్యూ బృందం రావడం ఆలస్యమవడంతో అందులో పడిపోయింది.  

మరిన్ని వార్తలు