రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం

5 Sep, 2020 19:37 IST|Sakshi

న్యూఢిల్లీ : భార‌త‌ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  రష్యా రాజధాని మాస్కో వేదిక‌గా చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘేతో స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే.  ఈ ఏడాది మేలో భారత్‌-చైనా సరిహద్దులో వివాదం తరువాత ఇరు దేశాల రక్షణశాఖ మంత్రులు ఉన్నత స్థాయిలో సమావేశమవడం ఇదే తొలిసారి. దాదాపు రెండు గంట‌ల‌పాటు జ‌రిగిన ఈ భేటీలో ర‌క్ష‌ణ‌శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ స‌మావేశంలో సరిహద్దు అంశాన్ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ఘర్షణ చెలరేగిన అనంతరం ఇప్పటివరకు రెండు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్యనే చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి రాజకీయ భేటీ జరగడం ఇదే మొద‌టిసారి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. (చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ)

ఇదిలా ఉండ‌గా  గత మూడు నెల‌లుగా  భార‌త రక్షణ మంత్రిని కలిసేందుకు చైనా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలిసింది. గ‌డిచిన 80 రోజులల్లో మూడు సార్లు స‌మావేశ‌మ‌య్యేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు చైనా ర‌క్ష‌ణ మంత్రి వీ ఫెంఘే.. రాజ్‌నాథ్ సింగ్‌తో ప్ర‌స్తా‌వించిన‌ట్లు స‌మాచారం. అందుకే రాజ్‌నాథ్‌తో సంభాషించేందుకు ఆయ‌న‌ బ‌స చేస్తున్న హోట‌ల్‌కు వ‌చ్చేందుకు కూడా వీ ఫెంఘే అంగీక‌రించిన‌ట్లు వినికిడి. అంతేగాక‌ నిన్న మాస్కోలో జ‌రిగిన స‌మావేశంకూడా చైనా అభ్య‌ర్థ‌న మేర‌కు జ‌రిగింది. కాగా జూన్‌లో జరిగిన విక్ట‌రీ డే కవాతు కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోకు వ‌చ్చిన‌ప్ప‌డుడు కూడా ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యేందుకు చైనా అభ్య‌ర్థించింది. అయితే ఈ చ‌ర్చ‌కు భార‌త్ నిరాక‌రించింది. 


 

మరిన్ని వార్తలు