న్యూ ఇయర్‌ ఉత్సాహంపై ఒమిక్రాన్‌ నీడ

1 Jan, 2022 04:11 IST|Sakshi

వెల్లింగ్టన్‌: నూతన సంవత్సరం అన్నీ శుభాలు తెస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకోవడం పరిపాటి. కానీ ఈ దఫా న్యూ ఇయర్‌ వేడుకలపై ఒమిక్రాన్‌ భయాలు ప్రభావం చూపుతున్నాయి. అందుకే వరుసగా రెండో ఏడాది కొత్త సంవత్సర వేడుకలు పలు ప్రాంతాల్లో భారీగా జరగడం లేదు. అయితే నూతన ఏడాది కరోనాకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఒమిక్రాన్‌ చెలరేగుతుండడంతో ముందు జాగ్రత్తగా అనేక దేశాల్లో న్యూ ఇయర్‌ వేడుకలు అంతంతమాత్రంగా జరిగాయి. 

జపాన్‌లో వేడుకలకు బదులు కుటుంబాలతో గడపాలని నిర్ణయించుకున్నారు. మాస్కులు ధరించి ఆలయాలను దర్శించారు. దక్షిణ కొరియాలో బెల్‌ రింగింగ్‌ పండుగను వరుసగా రెండో సంవత్సరం రద్దు చేశారు. అనేక బీచ్‌లు, టూరిజం ప్రాంతాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు స్తబ్దుగా సాగాయి. దేశంలో ఒమిక్రాన్‌ సమూహ వ్యాప్తి జరగలేదు. కానీ ముందు జాగ్రత్తగా ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతున్నా కొన్ని ప్రాంతాల్లో వేడుకలు భారీగా జరిగాయి. కానీ అధిక శాతం ప్రదేశాల్లో జనం తక్కువ సంఖ్యలో కనిపించారు. కరోనాకు ముందు వేడుకలకు సిడ్నీలో సుమారు పదిలక్షల మంది చేరేవారు.

ఇప్పుడు కొద్ది మందే వచ్చారు. ఇండోనేసియాలో ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. చాలా చోట్ల నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. వేడుకలపై వియత్నాం నిషేధం విధించింది. హాంకాంగ్‌లో నిర్వహించే సంగీత విభావరిలో కేవలం 3,000 మందే పాల్గొనే వీలుంది. చైనాలో పలు ప్రాంతాల్లో వేడుకలను నిషేధిం చారు. దేవాలయాల్లో నూతన సంవత్సరాది వేడుకలను నిలిపివేశారు. థాయ్‌లాండ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్క డ వేడుకలపై ఎలాంటి నిషేధం లేదు. అయితే కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లో సంవత్సరాది ఉత్సాహంపై ఇటీవలి తుపాను నీళ్లు జల్లింది. దీంతో చాలామంది వేడుకలకు దూరంగా ఉన్నారు. యూరప్, యూఎస్‌ల్లో కేసులు పెరుగుతున్న వేళ పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు