Afghanistan: అశ్రఫ్‌ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది

18 Aug, 2021 20:51 IST|Sakshi

 మానవతా దృక్పథంతో అశ్రఫ్‌ ఘనీకి ఆశ్రయమిచ్చాం: యూఏఈ

సాక్షి, న్యూఢిల్లీ: తాలిబన్ల అక్రమణతో అఫ్గనిస్తాన్‌ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ, అతని కుటుంబం ఎక్కడ తల దాచుకున్నారో తెలిసిపోయింది. వారందరికీ తామే ఆశ్రయమిచ్చినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఐఈ) వెల్లడించింది. మానవతా ప్రాతిపదికన ఘనీ కుటుంబానికి ఆశ్రయమిచ్చినట్టు యుఏఈ  విదేశాంగ శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

అఫ్గన్‌ను హస్తగతం చేసుకునే క్రమంలో తాలిబన్లు కాబూల్‌కు చేరుకుంటున్న సమయంలోనే ఆదివారం అఫ్గన్‌ అధ్యక్షుడు అశ్రఫ్‌ఘనీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. తాలిబన్లు గెలిచారు. రక్తపాతాన్ని నివారించేందుకు తాను దేశం విడిచిపోతున్నట్టు ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. అయితే ఘనీ, భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారుతో  కలిసి తజకిస్తాన్‌,  ఉజ్బెకిస్తాన్‌, లేదా ఓమన్‌కు పారిపోయాడంటూ మొదట్లో పలు ఊహాగానాలొచ్చాయి. 
(Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా)

కాగా మాజీ దేశాధినేతలు, వారి బంధువులకు గల్ఫ్‌ దేశం ఆశ్రయం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2017లో, దుబాయ్ ఎమిరేట్‌లో థాయ్ మాజీ ప్రధాని యింగ్లక్ షినవత్రాకు ఆతిథ్యమిచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ గత సంవత్సరం ఆగస్టులోయూఏకీ చెక్కేశాడు.  అలాగే స్వదేశంలో హత్య కావడానికి ముందు ఎనిమిది సంవత్సరాలపాటు  పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత బెనజీర్ భుట్టో అక్కడే తలదాచుకున్నారు. 1996 నుండి 2001 వరకు పాలించిన మునుపటి తాలిబాన్ పాలనను గుర్తించిన మూడు దేశాల్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో సహా యూఏఈ కూడా ఒకటి కావడం విశేషం.

>
మరిన్ని వార్తలు