ఆకలి కేకలు, కరువు పరిస్థితులు

7 Dec, 2020 09:31 IST|Sakshi

ప్రపంచ దేశాలను హెచ్చరించిన డబ్ల్యూఎఫ్‌పీ

జెనివా: కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాదిని ఎంతో దుర్భరంగా మార్చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది ఎప్పుడు ముగుస్తుందా.. కొత్త సంవత్సరంలోకి ఎప్పుడు అడుగుపెడతామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కనీసం నూతన సంవత్సరం అయినా సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మరింత దారుణంగా ఉండనుందని.. విపత్తుగా మిగిలిపోనుందంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(డబ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేవిడ్ బీస్లీ రాబోయే సంవత్సరం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. "విపత్తు" మానవతా సంక్షోభాలకు తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2021 దాదాపు ఒక శతాబ్దంలో మానవులు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిపోనుందట. వచ్చే సంవత్సరం తీవ్రమైన ఆకలి, కరువు తాండవిస్తాయని..  ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు నిపుణులు తెలిపారు. (చదవండి: 2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది)

కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి, ప్రపంచంపై దాని ప్రభావాల గురించి చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బీస్లీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌పీ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 270 మిలియన్ల మంది ప్రజలు "ఆకలి వైపు పయనిస్తున్నారు", రానున్న ఏడాది తీవ్రమైన కరువు ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా బీస్లీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మహమ్మారి విజృంభణ వల్ల తలెత్తిన సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. ఈ ఏడాది దాదాపు 19 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాము. అయితే ఈ మొత్తానికి సంబంధించిన ఫలితం వచ్చే ఏడాది మనకు దక్కకపోవచ్చు’ అన్నారు. అంతేకాక ‘ఐక్యరాజ్యసమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లైతే 2021 చెత్త మానవతా సంక్షోభ సంవత్సరంగా ఉండబోతుంది. మనం మరో మెట్టు దిగబోతున్నాం’ అని హెచ్చరించారు. (చదవండి: ఆహారదాతకు ‘నోబెల్‌ శాంతి’)

ఈ విపత్తు పరిస్థితికి  కేవలం మహమ్మారి మాత్రమే కారణం కాదన్నారు బీస్లీ. కోవిడ్‌, దాని కట్టడి కోసం విధించిన ప్రభుత్వం నియంత్రిత లాక్‌డౌన్‌ మానవ పురోగతిని బాగా క్షీణింపజేశాయని..  "మానవ నిర్మిత సంఘర్షణ" కూడా ఈ పరిస్థితిలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు.  ముఖ్యంగా సిరియా, యెమెన్, దక్షిణ సూడాన్ వంటి దేశాలలో పరిస్థితి మరింత భయంకరంగా ఉండబోతుందని హెచ్చరించారు బీస్లీ. "మేము ఈ యుద్ధాలలో కొన్నింటిని ముగించాల్సి వచ్చింది. ఈ యుద్ధాలను మేము అంతం చేయవలసి ఉంది. అప్పుడే మనం కోరుకునే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించగలము" అని బీస్లీ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఆయన టైటానిక్‌తో పోల్చారు. ‘మేము వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఈ ప్రత్యేకమైన మంచుకొండకు నిధులను కేటాయించగల్గితే.. 2021లో వాటి ఫలితాలను పొందగలం. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే.. ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించగలం’ అన్నారు. గతంలో డబ్ల్యుఎఫ్‌పి ఈ ఏడాది చివరినాటికి పోషకాహార లోపం ఎదుర్కొంటున్న ప్రజల సంఖ్య 80 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలను హెచ్చరించింది. 
 

మరిన్ని వార్తలు