కెనడా ప్రధాని ట్రూడో ద్వంద్వ నీతి.. మరి ఆమె సంగతేంటి? 

24 Sep, 2023 17:05 IST|Sakshi

ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత్‌పై నేరారోపణ చేయడనికి కూడా వెనకాడని కెనడా ప్రధాని అనుమానాస్పద రీతిలో మరణించిన న్యాయవాది, బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది బలూచ్ మానవహక్కుల సంఘం.

ఉగ్రవాదికి అండగా?
ఈ ఏడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా గుమ్మం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమ్నెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. మొదటిగా కెనడాలోని భారతీయ దౌత్యాధికారిని కూడా విధుల నుంచి తొలగించగా భారత్ కూడా అందుకు దీటుగా స్పందించి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని తొలగించి ఐదురోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. 

ప్రధానికి లేఖ.. 
ఒక ఉగ్రవాది హత్య జరిగితే ఇంతగా స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడేళ్ళ క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ మరణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది కెనడాలోని బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాది హత్యపై ప్రధాని అత్యుత్సాహంతో చేసిన ఆరోపణలకు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ చేస్తుండడంపైనా కరీమా బలూచ్ మృతిపై కనీసం ఆయన స్పందించకపోవడంపై సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూ సంఘం ప్రధానికి ఒక లేఖను రాసింది.

సమన్యాయం చేయండి.. 
బలూచ్ మానవహక్కుల సంఘం లేఖలో ఏమని రాసిందంటే.."కెనడాలో బలూచ్ వర్గం చాలా చిన్నది. పైగా పార్లమెంట్ ప్రతినిధుల ఎంపికలో కూడా మేము పెద్దగా ప్రభావం కూడా చూపలేము. బహుశా అందుకే కెనడా ప్రభుత్వం కరీమా విషయంలో ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని రాసింది. ఈ సందర్బంగా కెనడా సమాజంలోని ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటంలో బలూచ్ వర్గం ఎంతగా సహకరించింది గుర్తుచేశారు. కరీమా కేసులో కూడా కెనడా లిబరల్ ప్రభుత్వం పారదర్శకతతో విచారణ జరిపించాలని కోరారు. రెండేళ్లుగా మా గోడును పట్టించుకోని ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని..  ఇప్పటికైనా బలూచ్ సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కరీమాకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు.

        

ఎవరీ కరీమా బలూచ్? 
కెనడాలో మూడేళ్ళ క్రితం డిసెంబర్, 20న బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత టొరంటోలోని ఒంటారియో సరస్సులో విగతజీవిగా కనిపించింది. ఈమె వృత్తి పరంగా న్యాయవాది కాగా బలూచ్ మానవహక్కుల కోసం బలంగా పోరాడారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆగడాలపై చేసిన పోరాటానికి 2016లో బీబీసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె చోటును దక్కించుకున్నారు.  

ఇది కూడా చదవండి: భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం'

మరిన్ని వార్తలు