కోవిడ్‌ ‘సూపర్‌ వేరియంట్‌’తో పెరుగుతున్న కేసులు.. అంత ప్రమాదకరమా?

31 Dec, 2022 14:51 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మళ్లీ కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.5(సూపర్‌ వేరియంట్‌) ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేసులు ఈ సూపర్‌ వేరియంట్‌ కారణమవుతున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ బీఎఫ్‌7తో పాటు ఎక్స్‌బీబీ.1.5 సూపర్‌ వేరియంట్‌పై ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం ఎక్స్‌బీబీ వేరియంట్‌గా పేర్కొన్నారు మిన్నేసోటా వర్సిటీ నిపుణులు డాక్టర్‌ మిచెల్‌ ఓస్టెర్‌హోమ్‌. అమెరికాలో తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలోని 7 రాష్ట్రాల్లో ఎక్స్‌బీబీ కేసులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ 31 నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో బీఏ.2, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ1.5ల కారణంగా 44.1 శాతం కేసులు నమోదయ్యాయి.

తొలికేసు భారత్‌లోనే..
ఎక్స్‌బీబీ వేరియంట్‌ను తొలుత భారత్‌లోనే ఈ ఏడాది ఆగస్టులో గుర్తించారు. కొద్ది రోజుల్లోనే భారత్‌తో పాటు సింగపూర్‌లో ఈ వేరియంట్‌ వేగంగా విస్తరించింది. ఇది ఎక్స్‌బీబీ.1, ఎక్స్‌బీబీ1.5 వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని లక్షణాలు వేరుగా ఉన్నాయని, దీంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు జాన్ హోప్కిన్స్‌ వర్సిటీ నిపుణులు తెలిపారు. 

ఎక్స్‌బీబీ.1.5 వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి?
ఎక్స్‌బీబీ1తో పోలిస్తే ఎక్స్‌బీబీ1.5 శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకోవటమే కాదు, రోగనిరోధక శక్తిని దాటుకుని కణాల్లోకి ప్రవేశిస్తోందని తెలిపారు పెకింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అలాగే కీలక గ్రాహకాల ద్వారా కణాలను తన అధీనంలోకి తెచ్చుకుంటుని హెచ్చరించారు. ఎక్స్‌బీబీ ఉప రకాలు పుట్టుకస్తున్న కొలది ప్రస్తుత కోవిడ్‌ వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గిపోతుందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడంతో పాటు ఒకసారి సోకినవారికి సైతం మళ్లీ సులభంగా అంటుకుంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:  భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్

మరిన్ని వార్తలు