రష్యా వ్యూహం ఏంటి? యుద్ధ రంగంలో ఏం ప్రయోగిస్తోంది?

8 Oct, 2022 17:18 IST|Sakshi

యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోన్న తరుణంలో  సైనిక పరంగా ఇప్పటికే బాగా నష్టపోయి ఉన్న రష్యా చిన్నపాటి వ్యూహాత్మక అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పల్స్తో దాడులు పెంచాలని రష్యా భావిస్తోంది. తమ వద్ద రెండు వేలకు పైగా ఇటువంటి ఆయుధాలు ఉన్నాయని కూడా రష్యా అంటోంది.

దీంతో పాటు కొద్ది రోజుల క్రితమే రష్యా దీర్ఘశ్రేణి  న్యూక్లియర్ మిసైల్ ను పరీక్షించింది. ఈ పరీక్షలే ఇపుడు ప్రపంచ దేశాలను కంగారు పెడుతున్నాయి. రష్యా పొరపాటున అణ్వాయుధాలు ప్రయోగిస్తే  పరిస్తితిని అదుపులోకి తీసుకురావడం ఎవ్వరి వల్లా కాదని అగ్రరాజ్యం భయపడుతోంది. అపుడు జరగబోయే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు.

రష్యా చేతిలో కీలక అణు కర్మాగారం
జపోరిజియా లో  న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ ప్లాంట్ పై న్యూక్లియర్ వెపన్స్ దాడి చేస్తే  పెను విపత్తు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. రష్యా ఇదంతా ఎందుకు చేస్తోందో అర్ధం కావడం లేదంటున్నారు  కొందరు చరిత్ర కారులు. అయితే నాటో దేశాలకు చెక్ చెప్పడానికే ఉక్రెయిన్ పై యుద్దానికి కాలుదువ్వింది రష్యా.

ఉక్రెయిన్ వార్ సమయంలో అమెరికాతో కలిసి నాటో దేశాలన్నీ కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తనను ఇబ్బంది పెట్టిన దేశాలకు గట్టిగానే బదులివ్వాలని రష్యా పంతంగా ఉంది. అందుకే అణ్వాయుధాలను తెరపైకి తెచ్చి ఉంటుందని అంటున్నారు. అయితే కేవలం అందరినీ భయపెట్టడానికే రష్యా ప్రయత్నిస్తూ ఉండచ్చని నిజానికి రష్యా ఎలాంటి అణ్వాయుధాలను ప్రయోగించకపోవచ్చునని మేథావులు అభిప్రాయపడుతున్నారు.

నలిగిపోతోన్న ఉక్రెయిన్‌
పెద్ద దేశాల మధ్య పంతాల నడుమ ఉక్రెయిన్  పాపం బాగా నలిగిపోయింది. ఇప్పటికే నగరాలకు నగరాలు నాశనం అయిపోయాయి. కోట్లకు కోట్ల విలువ జేసే ఆస్తులు,భవనాలు బుగ్గిపాలయ్యాయి. శిధిలాల నడుమ ఉక్రెయిన్ గాయాల దిబ్బగా మారిపోయింది.దీన్నుంచి కోలుకుని పూర్వవైబవం తీసుకురావాలంటే ఉక్రెయిన్ ప్రభుత్వానికి  చాలా ఏళ్లు పడుతుంది.

ఇంతటి నెత్తుటి గాయానికి కారణం మాత్రం రష్యానే. అందుకే అది ఇపుడు ప్రపంచ దేశాల మేథావుల దృష్టిలో ఓ విలన్ గా మిగిలిపోయింది. రష్యా తప్పులపై తప్పులు చేసుకుంటూ పోతోంది. నాటో విస్తరణను అడ్డుకోవాలన్న  తలంపుతో ఉక్రెయిన్ పై యుద్దానికి దిగింది రష్యా. అయితే దాని వల్ల నాటో కూటమి మరింతగా విస్తరించింది. అలాగే ఇపుడు అణ్వస్త్రాలు ప్రయోగిస్తామన్న హెచ్చరిక ద్వారా యూరప్ దేశాలు అణ్వాయుధాలను పెంచుకునేందుకు రష్యానే ఓ దారి చూపినట్లయ్యిందంటున్నారు మేథావులు. ఇది ప్రపంచానికి కానీ రష్యాకి కానీ మంచివి కానే కావు. యుద్దానికి వీలైనంత తొందరగా  చరమగీతం పాడాలన్నది ప్రపంచం ఆశ. 

(చదవండి: ప్రపంచానికి పెను సవాల్‌ విసిరిన పుతిన్‌.. అదే జరిగితే భారీ విధ్వంసమే..?)
 

మరిన్ని వార్తలు