వెనక్కి తగ్గిన వాట్సాప్‌

17 Jan, 2021 05:09 IST|Sakshi

మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం వాయిదా

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానంపై వెనకడుగు వేసింది. కొత్త విధానాన్ని మే 15వ తేదీకి వాయిదా వేసింది. వ్యక్తిగత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటోందంటూ భారత్‌ సహా ప్రపంచదేశాల వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ఫిబ్రవరి 8వ తేదీన ఎవరి అకౌంట్‌నూ సస్పెండ్‌ చేయడం/ తొలగించడం జరగవు. వాట్సాప్‌లో గోప్యత, భద్రతా పరమైన అంశాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు మేం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాతే, ప్రస్తుత విధానాల్లో క్రమేపీ పరిశీలన జరిపి, మే 15వ తేదీ కల్లా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెస్తాం’అని బ్లాగ్‌ పోస్ట్‌లో వాట్సాప్‌ ప్రకటించింది.

‘ఇటీవలి అప్‌డేట్‌ నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఎంతో అయోమయానికి గురయ్యారు. ఎన్నో అనుమానా లు తలెత్తాయి. మా విధానాలు, వాస్తవాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేందుకు సాయపడాలనుకుం టున్నాం’అని అందులో తెలిపింది. వాట్సాప్‌ వేదికపై ఉండే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పూర్తిస్థాయిలో సంకేత రూపంలో ఉంటుంది. ఈ మెసేజీలను వాట్సాప్‌ గానీ, ఫేస్‌బుక్‌ గానీ చూడలేదని కూడా స్పష్టత ఇచ్చింది. యూజర్ల మెసేజీలు, కాల్‌లకు సంబంధించి తాము ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదని పేర్కొంది. వినియోగదారుల లొకేషన్‌ కూడా బయటకు వెల్లడయ్యేందుకు అవకాశం లేదని తెలిపింది. ఇటీవల ప్రకటించిన విధానం కారణంగా వ్యక్తిగత మెసేజీలపై ఎలాంటి ప్రభావం పడబోదని తెలిపింది.

40 కోట్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో వాట్సాప్‌ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సేవలు, విధానాల్లో మార్పులు చేపట్టినట్లు వాట్సాప్‌ గత వారం తెలిపింది. దీని ప్రకారం వినియోగదారులు తమ వాట్సాప్‌ సేవలను కొనసాగించాలంటే ఫిబ్రవరి 8వ తేదీ కల్లా ఈ విధానాలకు సమ్మతించాల్సి ఉందని తెలిపింది. వాట్సాప్‌ ప్రకటించిన వ్యక్తిగత గోప్యత విధానాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం కూడా ప్రకటించింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్‌ తాజా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. వాట్సాప్‌లో వ్యక్తిగత డేటా భద్రతపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో లక్షలాదిగా వినియోగదారులు గత కొద్ది రోజులుగా సిగ్నల్, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు