Fact Check: వాట్సాప్ పుకార్లు​.. వ్యాక్సిన్​తో చావు ఖాయం!

26 May, 2021 09:34 IST|Sakshi

వ్యాక్సిన్​ వేయించుకున్నారా? అయితే చావు ఖాయం. అది కూడా రెండేళ్లలోపే!. ఇది ఇప్పుడు వాట్సాప్​లో చక్కర్లు కొడుతున్న ఒక ఫార్వార్డ్ మెసేజ్ సారాంశం​. ఈ స్టేట్​మెంట్​ ఇచ్చింది ఎవరో కాదు.. ఫ్రెంచ్​ వైరాలజిస్ట్​, నోబెల్​ ప్రైజ్​ విన్నర్​ టుక్​ మోటాగ్నైర్. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం.. 

కరోనాకు సరైన మందు లేకపోవడంతో వ్యాక్సిన్​లనే నమ్ముకుంది యావత్​ ప్రపంచం. మరోవైపు వ్యాక్సిన్​తో ఎలాంటి ప్రభావం ఉండబోదని, సైడ్​ ఎఫెక్ట్స్​తో ఇబ్బంది పడాల్సి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు వాట్సాప్​ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మరో ఫార్వార్డ్​ మెసేజ్​ సర్క్యులేట్ అవుతోంది. ఏ వ్యాక్సిన్​ వేయించుకున్నా సరే రెండేళ్లలోపు చావు తప్పదనేది ఆ మెసేజ్​ సారాంశం. పైగా ఫ్రెంచ్​ వైరాలజిస్ట్​, నోబెల్​ గ్రహీత అయిన టుక్​ మోటాగ్నైర్​ పేరుతో ఆ వార్త వైరల్ అవుతోంది. దీంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. 

అసలు విషయం ఏంటంటే.. 
వ్యాక్సిన్​తో చావు ఖాయమని టుక్​ మోటాగ్నైర్​ స్టేట్​మెంట్ ఇచ్చినట్లు లైఫ్​సైట్​న్యూస్​ డాట్​ కామ్​ అనే వెబ్​సైట్​ ఆర్టికల్​ పబ్లిష్​ చేసింది. పైగా ఆయన వికీపీడియా పేజీలో కొంత కంటెంట్​ను కూడా అది షేర్​ చేసింది. అయితే ఆ వెబ్​సైట్​ దానిని యూఎస్​కు చెందిన ఎన్జీవో రెయిర్​ ఫౌండేషన్​ వెబ్​సైట్​ నుంచి  తీసుకుంది(మే 18న పబ్లిష్​ అయ్యింది). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్​ తీరును మాత్రమే తప్పుబట్టారు. అయితే ఆ వీడియోలో ఆయన ఇచ్చిన స్టేట్​మెంట్​ను పొరపాటున అర్థం చేసుకుని వ్యాక్సిన్​ వేసుకుంటే చనిపోతారని ఆ ఫౌండేషన్ కథనం​ రాసింది. అక్కడి నుంచి అది వాట్సాప్​లో వైరల్​ అయ్యింది. అయితే ఇది ఫేక్​ కథనం అని తేలడంతో అస్సాం పోలీసులు ఫేస్​బుక్​ పేజీలో ఫార్వార్డ్​ చేయొద్దంటూ  ఒక అలర్ట్​ పోస్ట్​తో వాట్సాప్​ యూజర్లకు సూచించారు.

    

ఆయన ఉద్దేశం.. 
హెచ్​ఐవీ పై పరిశోధనలకు గానూ 2008లో మోటాగ్నైర్​ నోబెల్ ప్రైజ్​ అందుకున్నారు. అయితే వ్యాక్సినేషన్​​ విషయంలో మొదటి నుంచి మోటాగ్నైర్​ది విచిత్రమైన వాదనే. వ్యాక్సిన్​లనేవి అసలు శాస్త్రీయం కాదని ఆయన వాదిస్తుంటారు. పైగా కరోనా వ్యాక్సిన్స్​ వల్లే ఇప్పుడు కొత్త వేరియెంట్స్​ పుడుతున్నాయనేది ఆయన అభిప్రాయం. అంతేకాదు కరోనా నోవెల్ వైరస్ అనేది మనిషి తయారు చేసిందేనని, హెచ్​ఐవీ నుంచి జెనెటిక్​ మెటీరియల్​తో దానిని రూపొందించారని స్టేట్​మెంట్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. ఎయిడ్స్​ జబ్బుకు వ్యాక్సిన్​ కనిపెట్టే క్రమంలో చైనా వుహాన్​ ల్యాబ్​లోనే కరోనా వైరస్​ పుట్టిందని స్టేట్​మెంట్​తో ఆయన పెద్ద దుమారమే రేపారు.

మరిన్ని వార్తలు