Whatsapp New Feature: వాట్సాప్‌ గ్రూప్‌.. ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఎగ్జిట్‌ అవ్వొచ్చు

20 May, 2022 08:42 IST|Sakshi

ఫ్రెండ్స్‌.. ఫ్యామిలీస్‌.. ఆఫీస్‌.. అపార్ట్‌మెంట్స్‌.. ఇలా ఒకటో, రెండో.. కాదు పదుల కొద్దీ వాట్సాప్‌ గ్రూప్స్‌.. వందల కొద్దీ మెసేజీలు.. ఒక్కోసారి ఫొటోలు, వీడియోలతో మెమరీ నిండిపోతుంది. గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్‌ అవుదామనుకున్నా.. ఏమైనా అనుకుంటారేమోనన్న ఉద్దేశంతో బలవంతంగా అయినాకొనసాగుతుంటారు. మరెలా..? ఏముందీ ఎవరికీ తెలియకుండా, గ్రూప్‌లో ఎగ్జిట్‌ నోటిఫికేషన్‌ రాకుండానే బయటపడొచ్చు.

వాట్సాప్‌ త్వరలోనే ఈ వెసులుబాటును అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లలో కొందరికి ఈ ఆప్షన్‌ ఉన్నట్టు ‘డబ్ల్యూఏ బీటా ఇన్ఫో’ అనే టెక్‌ నిపుణుల బృందం గుర్తించింది. అయితే.. ఇలా ఎగ్జిట్‌ అయినట్టు గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రం తెలుస్తుందట. గ్రూప్‌లో నోటిఫికేషన్‌ రాదని.. మెంబర్లకు తెలియదని నిపుణులు చెప్తున్నారు. బలవంతంగా గ్రూపుల్లో కొనసాగుతూ ఇబ్బందిపడుతున్నవారికి ఈ ఆప్షన్‌ బాగా తోడ్పడుతుందని అంటున్నారు.
చదవండి: పామాయిల్‌ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే

అడ్మిన్లు డిలీట్‌ చేసేయవచ్చు
వాట్సాప్‌ గ్రూప్‌లలో ఎవరు పెట్టిన పోస్టులను వారు మాత్రమే డిలీట్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వివాదాస్పద, ఇబ్బందికర పోస్టులను పెడితే.. అవి గ్రూప్‌లో అందరికీ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరు పెట్టిన పోస్టులను అయినా అడ్మిన్లు డిలీట్‌ చేయగలిగే ఆప్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది.

►వాట్సాప్‌లో 2 గిగాబైట్ల వరకు పరిమాణం ఉన్న పెద్ద ఫైల్స్‌ను పంపుకోవడానికి అవకాశం రానుంది.

►ఒకేసారి ఏకంగా 32 మందితో గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్నీ వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది.

ఏమిటీ బీటా వెర్షన్లు?
వాట్సాప్‌ త్వరలో విడుదల చేసే వెర్షన్లను ముందుగా కొందరికి ప్రయోగాత్మకంగా అందిస్తుంది. వాటిలోని కొత్త ఆప్షన్లను వాడినప్పుడు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా మార్పులు చేయాలా అన్నది పరిశీలిస్తుంది. వీటినే బీటా వెర్షన్లు అంటారు. అన్నీ సరిదిద్దాక చివరగా మెయిన్‌ వెర్షన్‌ను వినియోగదారులందరికీ విడుదల చేస్తుంది. త్వరలో రాబోయే సదుపాయాలు ఇలా బీటా వెర్షన్లలో తెలిసిపోతుంటాయి.    
  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 
చదవండి:
 అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట 

మరిన్ని వార్తలు