ప్రెసిడెంట్‌ బైడెన్‌..!

7 Nov, 2020 03:59 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పీఠానికి మరింత చేరువలో డెమొక్రాటిక్‌ అభ్యర్థి

మరో మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌ కంటే ఆధిక్యం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్‌ (77) మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన గెలుపు ఇక లాంఛనమే కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రవారం వెలువడిన ఫలితాలను బట్టి ఇక్కడ బైడెన్‌ది పైచేయిగా ఉంది. జార్జియాలో 50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ట్రంప్‌ ఉండగా, ఇప్పుడు సీన్‌ మారిపోయింది.

ఇక్కడ బైడెన్‌ 1,579 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అదేవిధంగా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌ కంటే బైడెన్‌ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా బుధవారం వరకు ట్రంప్‌ 70 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉండటం గమనార్హం. నెవడాల్లోనూ బైడెన్‌ హవానే కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాలను బట్టి బైడెన్‌కు 264 ఎలక్టోరల్‌ ఓట్లు, ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు గాను 270 ఓట్లు సాధించిన వారికే అధ్యక్ష పీఠం దక్కనుంది.

జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఓటమి పాలైతే మళ్లీ ఎన్నికయ్యేందుకు ట్రంప్‌కు దారులు మూసుకుపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు 41 లక్షల ఓట్లు అంటే 1.3 శాతం ఓట్లు అధికంగా పడ్డాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్‌ వంటి రాష్ట్రాల్లో ఇంకా 60 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున బైడెన్‌ ఆధిక్యం మరింతగా పెరిగేందుకు అవకాశాలున్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ అంచనా వేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని, వాటిని తట్టుకునేందుకు కొంచెం ఓపిక అవసరమవుతుందని విజయానికి చేరువలో ఉన్న జో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

బైడెన్‌కు సీక్రెట్‌ సర్వీస్‌ రక్షణ
ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుంచే బైడెన్‌ వెంట సీక్రెట్‌ సర్వీస్‌ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా అంటోంది.

ఎన్నికల రోజున బైడెన్‌ వాహన కాన్వాయ్‌కి కూడా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రతా విభాగం స్పందించడం కాస్త ఆలస్యమైనా ఈ పరిణామాన్ని తాము ముందుగానే ఊహించామని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉన్నప్పటికీ వెంటనే ట్రంప్‌ ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు.

కాగా, పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నెవడాల్లో పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌ అనుచరులు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ పరిణామాలపై బైడెన్‌ ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జూలై 19న మేం చెప్పిన విధంగానే, అమెరికా ప్రజలు ఈ ఎన్నికల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్ష భవనంలో దొంగచాటుగా తిష్ట వేసే వారిని అడ్డుకునే సమర్థత అమెరికా ప్రభుత్వానికి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

120 ఏళ్లలో అత్యధిక ఓటింగ్‌
ఈ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. గత 120 ఏళ్ల రికార్డులన్నీ తిరగరాసేలా ఓటర్లు తమ ఓటు హక్కు విని యోగించుకున్నట్టు అమెరికా ఎలక్షన్‌ ప్రా జెక్టు వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 16 కోట్ల మంది ఓటు వేశారు. 1900 ఎన్నికల తర్వా త ఈ స్థాయిలో ఓటర్లు తమ హక్కుని విని యోగించుకోవడంఇదే
తొలిసారి.

జార్జియాలో రీకౌంటింగ్‌
ట్రంప్, బైడెన్‌ల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో జార్జియాలో రీకౌంటింగ్‌ చేపట్టనున్నారు. ఇక్కడ బైడెన్‌కు 1,579 ఓట్ల స్వల్ప మెజారిటీ లభించినా ఇద్దరు అభ్యర్థులకు చెరో 49.4 శాతం ఓట్లు పడ్డాయి. మరో 4,169 ఓట్లను లెక్కించాల్సి ఉంది. జార్జియా చట్టాల ప్రకారం ఇద్దరు అభ్యర్థుల ఓట్లలో 0.5 శాతం ఓట్ల తేడా ఉంటే వారి కోరిక మేరకు రీకౌంటింగ్‌ జరపొచ్చు. రిపబ్లికన్‌ పార్టీ కంచుకోటగా ఉన్న జార్జియాలో సైనిక సిబ్బంది, ఇతరుల ఓట్లు మరో 9వేల వరకు రావాల్సి ఉన్నందున ఫలితాలపై ప్రభావం చూపొచ్చు. గతంలో ఇక్కడ జరిగిన రీ కౌంటింగ్‌తో ఫలితాలు మారలేదనీ, తాజా రీకౌంటింగ్‌తో కొత్త పరిణామాలకు తావుండదని భావిస్తున్నారు.

అంతా గందరగోళం
అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు ఏ రాష్ట్రంలో ముందంజలో ఉన్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అక్కడ మీడియా సంస్థలే. ఒక్కో చానెల్‌ ఒక్కో అంకెలు చూపిస్తూ ప్రపంచ దేశాల ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. అసోసియేట్‌ ప్రెస్, ఫాక్స్‌ న్యూస్‌ బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారని, మేజిక్‌ ఫిగర్‌ 270కి ఆరు ఓట్లు దూరంలో ఉన్నారని చెబుతున్నాయి. ఇక మిగిలిన మీడియా బైడెన్‌కి 253 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చినట్టుగా చెబుతున్నాయి.

11 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న అరిజోనా రాష్ట్రం విషయంలో ఏర్పడిన గందరగోళం ఎన్నికల తీరుతెన్నుల్ని అర్థం చేసుకోలేనట్టుగా మారింది. అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంçస్థ లేదు. అమెరికాలో ఏ ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ఎన్నికల నిర్వహణ బాధ్యతని తీసుకుంటాయి. ఈ సారి కరోనా ప్రభావంతో 68% ఓట్లు ముందస్తుగా పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించాలంటే ఓటరు సంతకం, సాక్షి సంతకాలు, చిరునామా కచ్చితంగా పరిశీలించాలి. ఆ తర్వాత కౌంటింగ్‌ మిషన్లలో సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతోంది.

ఫీనిక్స్‌లో ట్రంప్, బైడెన్‌ మద్దతుదారుల వాగ్వాదం


పొమోనాలో ఇంకా లెక్కించాల్సిన సంచులకొద్దీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

మరిన్ని వార్తలు