కరోనాపై ప్రచారాల్లో వాస్తవమెంత.. డబ్ల్యూహెచ్‌ఓ ఏం చెబుతోంది?

29 Apr, 2021 09:34 IST|Sakshi

కరోనా వ్యాప్తి, నివారణ, ఉపశమనంపై సోషల్‌ మీడియాలో ఎన్నో రకాల ప్రచారం జరుగుతోంది. అందులో కొన్నింటిపై జనంలో అవగాహన వచ్చినా.. ఇంకా చాలా అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు, దోమలు, ఈగల ద్వారా కరోనా సోకేందుకు అవకాశమే లేదు. అయినా వాటి ద్వారా వ్యాపించవచ్చనే తప్పుడు ప్రచారమూ జరుగుతోంది. కొందరు తెలిసీ తెలియకుండా వాటిని షేర్‌ చేస్తు్తన్నారు. నిత్య జీవితంతో ముడిపడి ఉన్న ఇలాంటి విషయాల్లో వదంతులు గందరగోళాన్ని, భయాన్ని రేపుతున్నాయి. ఇలాంటి ప్రచారంలో వాస్తవమెంత? ఏది సరైనదనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏం చెబుతోందో తెలుసుకుందామా? 

ప్రశ్న: వ్యాయామం చేసేటప్పుడు కూడా మాస్కులు అవసరమా? 
డబ్ల్యూహెచ్‌వో: వ్యాయామం చేసే సమయంలో మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఆ సమయంలో వచ్చే చెమట మాస్కులను తడిగా చేసి శ్వాసించే ప్రక్రియను క్లిష్టతరం చేయడంతోపాటు సూక్ష్మజీవులు పెరగడానికి కారణం అవుతుంది. వ్యాయామం చేసే సమయంలో మాస్కులు తీసివేసి కనీసం ఒక మీటర్‌ భౌతిక దూరం పాటించడమే మేలు. 

ఈత కొడితే కరోనా వస్తుందా? 
ఈత కొట్టే సమయంలో నీటి ద్వారా కరోనా వైరస్‌ సంక్రమించదు. కేవలం వైరస్‌ ఉన్న వ్యక్తికి సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్‌ సోకే
అవకాశం ఉంది. 

వేడినీళ్లతో స్నానంతో ప్రయోజనముందా? 
వేడినీళ్ల స్నానం చేసినంత మాత్రాన కోవిడ్‌ వైరస్‌ రాదనేది కరెక్ట్‌ కాదు. బాగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం మంచిది కాదు. 

దోమలు, ఈగల ద్వారావైరస్‌ సంక్రమిస్తుందా? 
దోమలు, ఈగల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కేవలం వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరుల శరీరాల్లోకి వైరస్‌ వెళుతుంది.  

చదవండి: కరోనా కాలం: అపోహలు, వాస్తవాలు
కరోనా: ఏది నిజం.. ఏది అబద్ధం.. కేంద్రం వివరణ

మరిన్ని వార్తలు