దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్‌వో బృందం

4 Dec, 2021 04:47 IST|Sakshi

జోహన్నస్‌బర్గ్‌: కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బృందం ఆ దేశానికి వెళ్లింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌కి కేంద్రమైన గౌటాంగ్‌ ప్రావిన్స్‌లో కేసుల్ని పర్యవేక్షించడానికి డబ్ల్యూహెచ్‌ఒ తన బృందాన్ని పంపించింది. కరోనా బాధితులతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి పరీక్షలను అత్యధికంగా నిర్వహించడానికి ఈ బృందం దక్షిణాఫ్రికాకు వెళ్లినట్టుగా డబ్ల్యూహెచ్‌వో రీజనల్‌ డైరెక్టర్‌ ఫర్‌ ఆఫ్రికా డాక్టర్‌ సలామ్‌ గూయె చెప్పారు. దేశంలోని కేసుల్లో 80 శాతం దక్షిణాఫ్రికా ఎకనామిక్‌ హబ్‌ అయిన గౌంటెంగ్‌ ప్రావిన్స్‌లో వెలుగు చూశాయి.

10–14 ఏళ్ల వారిలో అధిక కేసులు
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విశ్వరూపం చూపిస్తోంది. నవంబర్‌ మొదట్లో రోజుకి 200 నుంచి 300 కేసులు నమోదైతే గురువారం ఒక్క రోజే దక్షిణాఫ్రికాలో 11,500 కొత్త కేసులు వెలుగులోకి రావడం ఆందోళన పుట్టిస్తోంది.  ఎక్కువగా 10–14 ఏళ్ల వారికి సోకుతున్నాయి. 5ఏళ్లలోపు పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని దక్షిణాఫ్రికా  అధికారులు చెప్పారు. కొత్త వేరియెంట్‌ గురించి దక్షిణాఫ్రికా హెచ్చరించిన వారం రోజుల్లోనే 5రెట్లు ఎక్కువ కేసులు నమోదవడం దడ పుట్టిస్తోంది.  

శ్రీలంకలోనూ ఒమిక్రాన్‌..
శ్రీలంకలో తొలిసారిగా శుక్రవారం ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ సోకినట్టు తేలిందని, అతను కుటుంబ సభ్యులతో క్వారంటైన్‌లో ఉన్నాడని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు అమెరికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ బ యటపడడంతో ప్రజలందరూ బూస్టర్‌ డోసుల్ని తీసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్‌ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ లేకుండానే కరోనాను కట్టడి చేస్తామని బైడెన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు