Italy PM Giorgia Meloni: చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని?

28 Sep, 2022 11:29 IST|Sakshi

జార్జియా మెలోని(45).. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా అవతరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి ప్రధానిగా ఆమె చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నారు. అంతేగాక ఇటలీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే.  బ్రదర్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద జార్జియా మెలోని ఇటీవల(ఆదివారం) జరిగిన ఎన్నికల్లో మారియో డ్రాఘీపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

గత ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు సాధించిన మెలోనీ పార్టీ ఈసారి 25 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లను గెలుచుకుంది. ప్రధానిగా గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తామని, ఎవరినీ మోసం చేయమని తెలిపారు.ఈ నెలాఖరులోగా ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది

ఎవరీ జర్జియా మెలోని..
జార్జియా గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టిన వెంటనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మెలోని తన తల్లి వద్దే పెరిగింది. 15 ఏళ్ల వయసులో ఫాసిస్టు నియంత బెనిటో ముస్సోలినీ మద్దతుదారులు స్థాపించిన ‘ఇటాలియన్‌ సోషల్‌ మూవ్‌మెంట్‌’ యూత్‌ విభాగంలో చేరారు. 1990లో నేషనల్ అలయెన్స్ (ఏఎన్)లో ఎంఎస్ఐ భాగమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని సిల్వియో బెర్లస్కోనీ స్థాపించిన ప్రధాన కన్జర్వేటివ్ గ్రూపులో విలీనమైంది. 
చదవండి: క్వీన్‌ ఎలిజబెత్‌ హ్యాండ్‌బ్యాగ్‌ వెనక ఇంత రహస్యముందా?

‘బ్రదర్‌ ఆఫ్‌ ఇటలీ’ స్థాపన
2012లో మెలోని ఏఎన్‌లోని ఇతర సభ్యులు అందులో నుంచి బయటకు వచ్చి ‘బ్రదర్‌ ఆఫ్‌ ఇటలీ’ పార్టీని స్థాపించారు. ఇటలీ జాతీయ గీతంలోని తొలి పంక్తులనే ఈ పార్టీకి పేరుగా పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మెలోని మాట్లాడుతూ.. తన పార్టీని యూఎస్ రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీతో పోల్చారు. తన పార్టీ దేశభక్తికి, కుటుంబ సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు.

21 ఏళ్లకే రాజకీయాల్లోకి
మెలోని తన 21 ఏళ్ల వయసులోనే అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటి చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. 2008 బెర్లుస్కోనీ ప్రభుత్వంలో ఆమె యూత్ పోర్ట్‌ఫోలియో మంత్రిగా పనిచేశారు. అప్పటికి ఆమె వయసు 31 ఏళ్లు. అతిచిన్న వయసులో ఆ ఘనత సాధించిన మహిళగా మెలోని రికార్డులకెక్కారు. 2019లో మెలోని ‘నేను జార్జియా, నేను మహిళను, నేను తల్లిని, నేను ఇటాలియన్‌ని, నేను క్రిస్టియన్‌. నా నుంచి వీటిని వేరుచేయలేరు’ అంటూ చేసిన ప్రసంగం ఆమె మద్దతుదారులను ఉత్సాహపరిచింది.

ఎల్‌జీబీటీకి వ్యతిరేకం
జూన్‌లో ఇచ్చిన మరో ప్రసంగంలో ఆమె సంప్రదాయ కుటుంబాలకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. లైంగిక గుర్తింపు, ఎల్జీబీటీ లాబీని తీవ్రంగా వ్యతిరేకించారు. లింగపరమైన గుర్తింపునకు ఓకే కానీ, జెండర్ భావజాలానికి తాను వ్యతిరేకమని చెప్పారు. సురక్షితమైన సరిహద్దులకు ఓకే కానీ.. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తెలిపారు. మన ప్రజల కోసం పనిచేయాలని కానీ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల కోసం కాదని జార్జియా స్పష్టం చేశారు. స్పానిష్ రైటిస్ట్ పార్టీ వోక్స్ మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పార్లమెంట్‌లోని మితవాద యూరోపియన్ కన్జర్వేటివ్, రిఫార్మిస్ట్ గ్రూప్‌కు మెలోని అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇందులో ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, పోలాండ్ నేషనలిస్ట్ లా అండ్ జస్టిస్ పార్టీ, స్పెయిన్ రైట్ వోక్స్ మితవాద స్వీడన్ డెమొక్రాట్‌లు ఉన్నాయి..

దేశ రాజకీయాల్లో మార్పులు
కాగా ఇటలీ ప్రధానిగా మెలోని బాధ్యతలు స్వీకరిస్తే ఆ దేశ రాజకీయాల్లో కీల మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం  ఆమె  ఎల్‌జీబీటీ  హక్కులకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపించడం. అలాగే ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు.


చదవండి: NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!

మరిన్ని వార్తలు