గిన్నిస్‌ రికార్డు: సింగిల్‌ డేలో 27 దేశాల నుంచి ఏకంగా 37,018 మంది రక్తదానం

22 Sep, 2022 09:43 IST|Sakshi

వైరల్‌: హూ ఈజ్‌ హుస్సేన్‌ సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించింది! హుస్సేన్‌ ఎవరంటూనే గిన్నిస్‌కెక్కిందంటున్నారు ఏమిటా అని అవాక్కవుతున్నారా.. ఇంతకీ విషయం ఏమిటంటే.. హూ ఈజ్‌ హుస్సేన్‌ అనేది బ్రిటన్‌లోని ఓ సామాజిక న్యాయ దాతృత్వ సంస్థ.

గత నెల 27న భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏ రేంజ్‌లో అంటే... ఒకేరోజులో 27 దేశాల నుంచి ఏకంగా 37,018 మంది రక్తదానం చేశారు. న్యూజిలాండ్‌లో 27న తెల్లవారగానే మొదలైన రక్తదానం అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో అదేరోజు వలంటీర్లు చేసిన రక్తదానంతో ముగిసింది. ఈ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులు.. హూ ఈజ్‌ హుస్సేన్‌ సంస్థ సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించినట్లు ఈ నెల 17న అధికారికంగా ధ్రువీకరించారు.

2020లో ఒకేరోజు 34,723 మంది చేసిన రక్తదానం రికార్డును హూ ఈజ్‌ హుస్సేన్‌ బద్దలుకొట్టిందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిల్వలకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో తాము గ్లోబల్‌ బ్లడ్‌ హీరోస్‌ పేరిట విస్తృత ప్రచారం చేపట్టి ఒక్కరోజులోనే 37 వేల మందికిపైగా వలంటీర్లలో స్ఫూర్తినింపగలిగామని హూ ఈజ్‌ హుస్సేన్‌ నిర్వాహకులు తెలిపారు. ఒక్కో వ్యక్తి చేసే రక్తదానం ద్వారా ముగ్గురి రోగుల వరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని.. ఈ లెక్కన తాము 37 వేల మందికిపైగా దా­తల నుంచి సేకరించిన రక్తం ద్వారా ఏకంగా 1.10 లక్షల మంది రో­గులను కాపాడొచ్చని చెప్పారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ హుస్సేన్‌ పేరు ఏమిటని సంస్థ నిర్వాహకులను అడిగితే సుమారు వెయ్యేళ్ల కిందట జీవించిన మొహమ్మద్‌ ప్రవక్త మనవడు హుస్సేన్‌ ఇబిన్‌ అలీ తన జీవితాంతం చేసిన నిస్వార్థ సేవలకు గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు వివరించారు.

ఇదీ చదవండి: హిజాబ్‌ నిరసనల్లో ఆరుగురు మృతి

>
మరిన్ని వార్తలు