అమ్మే నాకు స్ఫూర్తి.. రియల్‌ హీరో: కమలా హారిస్‌

12 Aug, 2020 12:21 IST|Sakshi
తల్లితో కమల.. చిన్ననాటి ఫొటో

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో దిగిన జో బిడెన్‌ మంగళవారం కీలక ప్రకటన చేశారు. భారత సంతతికి చెందిన సెనెటర్‌ కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిపారు. దీంతో ఈ అవకాశం దక్కించుకున్న తొలి శ్వేత జాతీయేతర మహిళగా కమల చరిత్రకెక్కారు. (బరిలో కమలా హారిస్ : ట్రంప్ స్పందన) 

ఇక అగ్రరాజ్య చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షులుగా పనిచేసిన దాఖలాలు లేవన్న విషయం తెలిసిందే. 1984 లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా పార్టీల ఓటమి కారణంగా వారు విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించినట్లయితే ఉపాధ్య పదవి అలంకరించే తొలి మహిళగా కమలా హారిస్‌ నూతన అధ్యాయం లిఖించే అవకాశం ఉంది. భారత సంతతి తొలి సెనెటర్‌గా ప్రసిద్ధికెక్కిన ఈ ఇండో- అమెరికన్‌ గురించిన కొన్ని ఆసక్తికర అంశాలు మీకోసం.

తమిళనాడు మూలాలు
1964 అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్‌ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్‌- డొనాల్డ్‌ హారిస్‌లు. తమిళనాడులోని చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌ న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. కమల.. తాతగారు పీవీ గోపాలన్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుడు.  దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. ఆమె అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల  తాత ప్రభావం ఆమెపై పడింది. చెన్నై స్సెషల్‌ ఇడ్లీ సాంబార్‌ అంటే కమలకు ఎంతో ప్రీతి.

విద్యాభ్యాసం- రాజకీయ జీవితం
కమలా హారిస​ 1986లో హోవార్డ్‌ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్‌ కాలేజీ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.  డెమొక్రటిక్‌ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఈ క్రమంలో 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్‌ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. అదే విధంగా 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆఫ్రికా సంతతికి చెందిన తండ్రి- ఆసియా సంతతి చెందిన తల్లి పెంపకంలో అటు ఆఫ్రికా, ఇటు ఆసియా సంస్కృతుల కలబోతగా నిలిచిన కమలా హారిస్‌ను మిశ్రమ సంస్కృతి కారణంగా రాజకీయంగా బరాక్‌ ఒబామాతోనూ పోలుస్తారు. కాగా కమలా హారిస్‌ 2014లో డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు.  

అమ్మే నాకు స్ఫూర్తి.. రియల్‌ హీరో
కమలా హారిస్‌కు తన తల్లి పట్ల అమితమైన ప్రేమానురాగాలు, గౌరవం ఉన్నాయి. ఓ మహిళగా తాను సాధించిన ప్రతీ విజయానికి అమ్మే కారణమని పలు సందర్భాల్లో కారణమని చెప్పుకొచ్చారామె. తనకు దక్కిన గౌరవాలు, భూమి మీద ఉన్న విలువైన సంపదల అన్నింటికంటే శ్యామలా గోపాలన్‌ కూతురిగా చెప్పుకోవడమే ఇష్టమని తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అనేక కట్టుబాట్లను అధిగమించి 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకోసం అమెరికా వచ్చిన ఓ అమ్మాయి.. బ్రెస్ట్‌ కాన్సర్‌పై పరిశోధనలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన తీరు తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సింగిల్‌ పేరెంట్‌గా ఉంటూనే ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను తలకెత్తుకుని, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వైనం మరువలేనిదని తల్లి తమకోసం చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. తల్లి తరఫు బంధువులను కలిసేందుకు తాము ఎన్నోసార్లు భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. 

ఇక తను అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న తరుణంలో.. ‘‘అమ్మ గురించి ఆలోచిస్తున్నా. తనెంతో స్మార్ట్‌, నా ప్రచారానికి తొలి స్టాఫర్‌ తనే. ప్రతీ క్షణం తను నాతోనే ఉంటుంది. విలువలతో కూడిన జీవితం గడిపేందుకు తను అందించిన స్ఫూర్తి నన్ను ముందుకు నడుపుతూనే ఉంటుంది’’అంటూ తల్లిని రియల్‌ హీరోగా అభివర్ణించారు. కాగా కమలా హారిస్‌కు ఏడేళ్ల వయసు ఉన్నపుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో కమలతో పాటు ఆమె సోదరి మాయా బాధ్యతను వారి తల్లి శ్యామల స్వీకరించారు. వీరిద్దరు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కమలా రాజకీయాల్లో రాణిస్తుండగా.. మాయా హిల్లరీ క్లింటన్‌ న్యాయవాదిగా, సలహాదారుగా పనిచేశారు. 

ఫర్‌ ద పీపుల్‌ నినాదంతో..
‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అంటూ కమలా హారిస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి పోటీ చేసే విషయమై గతేడాది జనవరిలో ప్రకటన చేశారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్‌ నుంచి‘ఫర్‌ ద పీపుల్‌’  అనే నినాదంతో  తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్‌ పాలసీ, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రముఖంగా చర్చించారు. ‘మనమంతా కలిసే ఈ పని పూర్తి చేస్తాం. మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం’ అం‍టూ కమల విడుదల చేసిన క్యాంపెయిన్‌ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. 

అందుకు తగ్గట్టే ప్రచార పథంలో దుసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే కమల.. 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు అదే ఏడాది డిసెంబరులో కమల ప్రకటన చేశారు.

‘నేను బిలియనీర్‌ను కాదు. నా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లలేను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు నా వద్ద సరిపడా ఆదాయ వనరులు లేవు. ఇందుకోసం అన్ని మార్గాలు నేను అన్వేషించాను. అయితే కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలపై విశ్లేషణాత్మక విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ జీవితంలో అనేక సవాళ్లను అధిగమించి ఇప్పటికే పలు అంశాల్లో మేటి అనిపించుకున్న ఆమె.. తాజాగా జో బిడెన్‌ నిర్ణయంతో మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు. 

మరిన్ని వార్తలు