WHO: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు

13 Dec, 2021 18:06 IST|Sakshi

జెనీవా: వైద్య సేవల కోసం తమ సొంతంగా ఖర్చు చేయాల్సి రావడంతో దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రజలు వైద్య సేవలు పొందే సామర్ధ్యంపై కోవిడ్‌ 19 ప్రభావం గురించి ఎత్తి చూపుతూ పై విధంగా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రెండు కొత్త నివేదికలను ప్రకటించింది. కోవిడ్‌ నుంచి కోలుకొని మరింత మెరుగ్గా నిర్మించుకునేందుకు ప్రయత్నించాలని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. అలాగే  కొన్ని మార్గదర్శకాలను అందించింది.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో గత రెండు దశాబ్దాలుగా సాధించిన ప్రపంచ పురోగతిని కోవిడ్‌ మహమ్మారి ఆపే అవకాశం ఉందని పేర్కొంది. మహమ్మారికి ముందే తమ సొంత ఆరోగ్యం ఖర్చుల  కారణంగా 50 కోట్ల  ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారని పేర్కొంది. ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగిందని అంచనా వేస్తున్నాయి.  పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నందున ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్‌ బ్యాంక్‌ అందించిన నివేదికలు హెచ్చరించాయి.
చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్‌ కేసులు.. ‘ఏప్రిల్‌ నాటికి వేల సంఖ్యలో మరణాలు’!

2020లో కోవిడ్‌ ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగించిందని, అదే విధంగా 1930 తరువాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమైందని పేర్కొంది. దీని వలన ప్రజలు సంరక్షణ కోసం చెల్లించడం కష్టతరంగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కోవిడ్‌కు ముందు దాదాపు బిలియన్‌మంది ప్రజలు(100కోట్లు) తమ సంపాదనలోని 10శాతం ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రపంచ బ్యాంకుకు చెందిన బువాన్‌ ఉరిబె వెల్లడించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.
చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం

ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవలపై ఖర్చు చేసే వ్యయాన్ని పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఉరిబె తెలిపారు. మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. తమ శక్తికి మించి ఆరోగ్య ఖర్చులు చేస్తున్న కుటుంబాలలో 90 శాతం వరకు ఇప్పటికే దారిద్య్ర రేఖ దిగువన ఉన్నాయని పేర్కొంది.

ఇంకా ఏ మాత్రం సమయం లేదని, ప్రపంచ దేశాలన్ని ఆర్థిక పరిణామాలకు భయపకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేవలు పొందగలరని తమ పౌరులకు నమ్మకం కలిగించాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాంటి ప్రయత్నాలను వెంటనే ప్రారంభించి, వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దీనర్థం వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, అలాగే ఇంటికి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెంచాలన్నారు.

మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదని, ఈసారి భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలని పేర్కొన్నారు. యూనివర్సల్‌హెల్త్‌ కవరేజ్‌ దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్ధ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని కోరింది.

మరిన్ని వార్తలు