ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు.. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలో షాకింగ్ నిజాలు..

10 Mar, 2023 18:42 IST|Sakshi

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్‌ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష‍్యం  దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన ‍వ్యక్తం చేసింది.

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ  మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది.

డబ్లూహెచ్‌ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే  2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్,  ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే  కారణమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు.  సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

చాలా దేశాలు  సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం,  ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. 

సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ  అన్ని దేశాలకు  సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ  బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది.

సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు

1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి.

2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి.

3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి.

4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.

సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది.
చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్‌ టెన్షన్‌.. టేకాఫ్ క్యాన్సిల్‌

మరిన్ని వార్తలు