ఆస్ట్రాజెనికా టీకాపై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు

12 Mar, 2021 18:41 IST|Sakshi

టీకాతో రక్తం గడ్డకడుతున్నట్లు వస్తోన్న ఆరోపణలపై స్పందించని డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాపై వస్తోన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. వ్యాక్సిన్‌ వినియోగాన్ని ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. పలు యూరోపియన్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు రావడంతో టీకా వినియోగాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందించింది. 

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిది ఒకరు మాట్లాడుతూ..‘‘మిగతా వాటితో పోలిస్తే ఆస్ట్రాజెనెకా చాలా అద్భుతమైన టీకా. వ్యాక్సిన్‌ వినియోగాన్ని ఆపాల్సిన పని లేదు. మా అడ్వైజరీ కమిటీ టీకాకు సంబంధించిన డాటాను పరిశీలించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌కు, రక్తం గడ్డకట్టడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. అంతేకాక మేం మృతులకు సంబంధించిన డాటాను కూడా పరిశీలించాం. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఆస్ట్రాజెనెకా టీకా తీసుకోవడం వల్ల మరణించిన వారు ఒక్కరు కూడా లేరు’’ అని వెల్లడించారు. 

మార్చి 9 నాటికి యూరోపియన్‌ ఎకనామిక్‌ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్‌ మెడిసన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డెన్మార్క్‌, నార్వే, ఐస్‌లాండ్‌ దేశాలు గురువారం ప్రకటించాయి.

చదవండి: ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో  షాక్‌!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు