చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..!

3 Jan, 2023 17:30 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెడ్డడం లేదు. వైరస్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని కొద్దిరోజుల క్రితమే చేతులెత్తేసింది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలను చైనా దాస్తోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వాస్తవ గణాంకాలను చైనా వెల్లడించాలని, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరింది. వైరస్‌కు కట్టడిచేసేందుకు అవసరమైతే అంతర్జాతీయంగా సహకారం అందిస్తామని చెప్పింది. కోవిడ్ నిర్వహణకు వైద్య సామర్థ్యాన్ని పెంచుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చైనాకు సూచించింది.

చైనా నుంచి వచ్చేవారికి ఫ్రాన్స్‌లో పరీక్షలు..
చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడం కొనసాగిస్తామని ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్ని తెలిపారు. చైనా నుంచి నిరసనలు వ్యక్తం ‍అవుతున్నప్పటికీ దీనిపై తాము రాజీపడబోమన్నారు. పరీక్షలు నిర్వహించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

చైనా నుంచి వచ్చే వారికి భారత్, అమెరికా సహా పలు దేశాలు కరోనా పరీక్షను తప్పనిసరి చేశాయి. దీనిపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. ఇది వివక్షపూరిత చర్య అని వ్యాఖ్యానించింది.
చదవండి: అతి చేష్టలు: ఉక్రెయిన్‌కు రష్యా న్యూఇయర్‌ విషెస్‌

మరిన్ని వార్తలు