గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత కంపెనీ కలుషిత సిరప్‌ వల్లే!

6 Oct, 2022 07:24 IST|Sakshi

జెనీవా: భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. ఈ మేరకు.. 

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రెస్‌ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్‌ ఫార్మాసూటికల్స్‌ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్‌కు చెందిన మెయిడెన్‌ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్‌ వెల్లడించారు.  

మెయిడెన్‌ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్‌ సిరప్, Makoff బేబీ కాఫ్‌ సిరప్‌, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి.  డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది.

ల్యాబ్‌ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్‌ గ్లైకాల్‌, ఇథిలీన్ గ్లైకాల్‌తో సిరప్‌లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్‌లను వాడటం మానేయాలని కోరింది.

అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్‌ కంపెనీ స్థానికంగా(భారత్‌లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో, భారత ఔషధ నియం‍త్రణ మండలికి సూచించింది.

మరిన్ని వార్తలు