యువతతో పెద్దలకు కరోనా ముప్పు!

28 Aug, 2020 03:29 IST|Sakshi

మరణాలు అధికమయ్యే ప్రమాదం 

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

జెనీవా: యువతలో కరోనా విజృంభిస్తే, వారి ఇళ్లలోని పెద్దవారిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఫలితంగా మరణాలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని, కోవిడ్‌–19 సుడిగాలిలాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) యూరప్‌ చీఫ్‌ డాక్టర్‌ హన్స్‌ క్లూగ్‌ వెల్లడించారు. యువతరం కారణంగా కచ్చితంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుతోందన్నారు. మరోవైపు దక్షిణ కొరియాలో ఒకే రోజు అత్యధికంగా 441 కరోనా కేసులు కొత్తగా నమోదవడంతో, కరోనాని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ లాంటి ఆంక్షలు విధించవచ్చని భావిస్తున్నారు.

గత 14 రోజుల్లో దేశంలో కొత్తగా 4,000 కోవిడ్‌ కేసులు నమోదైనట్టు వైద్యులు పేర్కొన్నారు. సియోల్‌లో వైరస్‌ సోకిన వారిని గుర్తించటం చాలాకష్టతరంగా మారిందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ తెలిపింది. సియోల్‌లోని నేషనల్‌ అసెంబ్లీని మూసివేశారు. దేశ ఆర్థికాభివృద్ధి 1.3 శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని దక్షిణకొరియా సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇక కరోనా పుట్టినిల్లు చైనాలో వరుసగా గత 11 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా కట్టడి చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా సోకగా, మొత్తం 324 మంది చికిత్స పొందుతున్నారు.

కోవిడ్‌ వచ్చిన వారికే తిరిగి వస్తుందా?  
కరోనా వైరస్‌ సోకిన వారికి తిరిగి మళ్ళీ రెండోసారి కరోనా సోకుతుందా అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవేళ అదేజరిగితే వ్యాక్సిన్‌ కార్యక్రమంపై కూడా దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూకే కేంద్రంగా పనిచేస్తోన్న భారతసంతతికి చెందిన డాక్టర్‌ అసీమ్‌ మల్హోత్రా 21 రోజుల ఇమ్యూనిటీ ప్లాన్‌ని అభివృద్ధి పరిచి, కరోనా వైరస్‌ని ఎదుర్కొనేలా శరీరాన్ని సంసిద్ధం చేయడానికి పుస్తకరూపంలో పొందుపరిచిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు.
 

మరిన్ని వార్తలు