యూరప్‌లో థర్డ్‌ వేవ్‌!

24 Nov, 2020 04:48 IST|Sakshi
సందడి కనిపించని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వీధి

వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలయ్యే అవకాశం

యూరప్‌ దేశాలకు ఈసారి గట్టి దెబ్బ

సన్నద్ధతను మధ్యలోనే ఆపేయడంతో దుష్ఫలితాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

కరోనా మహమ్మారి యూరప్‌ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.  

లండన్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్‌ దేశాలు అసంపూర్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధి డేవిడ్‌ నబార్రో చెప్పారు. ఆయన తాజాగా స్విట్జర్లాండ్‌లో మీడియాతో మాట్లాడారు. యూరప్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే ప్రమాదముందని డేవిడ్‌ అన్నారు. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా మేల్కొంటే మేలు
యూరప్‌ దేశాలు కరోనా ఫస్ట్‌ వేవ్‌ను త్వరగానే అధిగమించగలిగాయి. వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేశాయి. ఆ తర్వాత కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్‌ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయని డేవిడ్‌ నబార్రో తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు వేసవి అనుకూల సమయమని తెలిపారు. ఆయితే, సన్నద్ధతను యూరప్‌ ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేశాయని ఆక్షేపించారు. మౌలిక సదుపాయాలను కూడా విస్మరించాయని అన్నారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లోనూ మేల్కోకపోతే థర్డ్‌ వేవ్‌ మరింత భీకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు.

ఆసియా దేశాలు భేష్‌
దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రించడంలో విజయం సాధించాయని డేవిడ్‌ ప్రశంసించారు. అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. కరోనాపై యుద్ధంలో ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. పలు ఆసియా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను అర్ధాంతరంగా నిలిపి వేయకుండా కరోనా అదుపులోకి వచ్చేదాకా కొనసాగించాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. యూరప్‌లో అలాంటి సన్నద్ధత కనిపించలేదని డేవిడ్‌ నబార్రో తెలిపారు.

ఎక్కడ.. ఎలా..?
► జర్మనీ, ఫ్రాన్స్‌లో శనివారం ఒక్కరోజే 33 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
► స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో నిత్యం వేలాదిగా కొత్తగా కేసులు బయటపడుతున్నాయి.
► టర్కీలో తాజాగా 5,532 కొత్త కేసులు బహిర్గతమయ్యాయి.
► బ్రిటన్‌ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ డిసెంబర్‌ 2వ తేదీన ముగియనుంది. దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతుండడంతో లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. సాధారణ ఆంక్షలే విధించనున్నట్లు సమాచారం.
► బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు