వైరస్‌ ముప్పు సమసిపోలేదు..

6 Dec, 2020 03:36 IST|Sakshi

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ ముప్పు ఇంకా సమసిపోలేదని, వైరస్‌ నివారణకు తయారవుతున్న వ్యాక్సిన్లు మాజిక్‌ బుల్లెట్లు కావని డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సమాఖ్య) హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్‌తో మహమ్మారి అంతం దగ్గరపడిందని శుక్రవారం వ్యాఖ్యానించిన సమాఖ్య, అంతమాత్రాన కరోనా పూర్తిగా మాయం అవుతుందని భావించట్లేదని తెలిపింది. వ్యాక్సిన్‌ రాగానే అందరికీ అందుబాటులోకి రాదని, అందువల్ల అప్రమత్తత తప్పదని తెలిపింది.

టీకాలు పనిచేయడం ప్రారంభించి క్రమంగా అందరిలో ఇమ్యూనిటీ పెరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం దాదాపు 51 టీకాలు మనుషులపై ప్రయోగదశలో ఉన్నాయని, వీటిలో 13 అంతిమ దశలో ఉన్నాయని పేర్కొంది. వాక్సిన్‌ పంపిణీ, నిల్వ ప్రయాసతో కూడిన అంశాలని గుర్తు చేసింది.  మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు దగ్గరపడుతుండడంతో మరింత జాగ్రత్త అవసరమని  సూచించింది. క్రిస్మస్‌ సమయంలో కేసులు మరోమారు పెరగవచ్చని అంచనా వేస్తోంది. అందువల్ల గుంపులుగా పండుగ జరుపుకోవద్దని సూచించింది.

మరిన్ని వార్తలు